హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): సెంట్రల్ పూల్ విద్యుత్తుపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇకపై ఆ పూల్ నుంచి రాష్ర్టాలకు విద్యుత్తును కేటాయించాలంటే డిస్కంలకు సక్రమంగా టారిఫ్ సబ్సిడీలను చెల్లించాలని, ఎలాంటి బకాయిలు ఉండరాదని స్పష్టం చేసింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులపై పన్నులు విధించినా, రాష్ర్టాల మధ్య విద్యుత్తు సరఫరాకు ఎలాంటి అడ్డంకులు కల్పించినా సెంట్రల్ పూల్ నుంచి కేటాయింపులు ఉండవని, రెగ్యులేటరీ అసెట్స్ ఉన్న రాష్ర్టాలకు కూడా విద్యుత్తును కేటాయించబోమని మార్చి 31న జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
వినియోగదారులకు విద్యుత్తు అందించడానికి అయ్యే వాస్తవ వ్యయం కంటే రెగ్యులేటరీ కమిషన్ తక్కువ ధరను నిర్ణయిస్తే డిస్కంలకు నష్టాలే మిగులుతాయి. వీటినే రెగ్యులేటరీ అసెట్స్ అంటారు. అంటే డిస్కంలకు నష్టం వాటిల్లకుండా ఎప్పటికప్పుడు విద్యుత్తు టారిఫ్లను పెంచుతూ ఉండాలన్నమాట. నిజానికి ఎన్టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో 80% రాష్ర్టాలకు కేటాయిస్తారు.
ఎవరికీ కేటాయించకుండా మిగిలిన 20 శాతాన్ని సెంట్రల్ పూల్ విద్యుత్తుగా పేర్కొంటారు. రాష్ర్టాలు అత్యవసర పరిస్థితులను అధిగమించేందుకు కేంద్రం ఈ పూల్ నుంచి తాత్కాలికంగా విద్యుత్తును కేటాయిస్తుంది. కానీ, ఇకపై సెంట్రల్ పూల్ నుంచి విద్యుత్తును పొందాలంటే ఏ రాష్ట్రమైనా ఇప్పటికే కొత్త నిబంధనలను అమలుచేసి ఉండాల్సిందే. వాటిలో ఏ నిబంధనను పాటించకున్నా విద్యుత్తు కేటాయింపులు ఉండవు.