హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : తెలంగాణకు సరిపడా యూరియా ఇవ్వకపోతే బీజేపీ నాయకుల ఇండ్ల ముందు బైఠాయిస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. రాష్ర్టానికి సరిపడా యూరియా సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నదని, ఇందుకు బీజేపీ ఎంపీలు కృషి చేయాలని కోరారు. బుధవారం గాంధీభవన్లో మంత్రితో ముఖాముఖీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దేశం మొత్తం కేంద్రమే యూరియా సరఫరా చేస్తున్నదని, కేంద్రం యూరియా ఇస్తే రాష్ర్టాలు పంపిణీ మాత్రమే చేస్తాయని తెలిపారు.
రాష్ర్టానికి ఎరువులు వచ్చిన, రాకపోయినా బీజేపీ నాయకత్వానిదే బాధ్యత అని పేర్కొన్నారు. రాష్ర్టానికి అవసరమైన యూరియా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి, మంత్రులు అనేకసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం లేదని వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. యూరియా, ఎరువులపై కేంద్రంలో ఏ మంత్రిని అయినా కలువడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఎరువుల కేటాయింపులు లేకపోతే బరాబర్ కేంద్రంతో కొట్లాడుతామని స్పష్టంచేశారు. రామగుండంలో ఉత్పత్తి అయిన ఎరువులు పూర్తిస్థాయిలో తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రేషన్ కార్డులపై ఎలాంటి దరఖాస్తులు రావడం లేదని, భూ సమస్యలు, కొత్త పెన్షన్లపై వస్తున్నట్టు చెప్పారు. ఈనెల 29 నుంచి(ఏరువాక పౌర్ణమి) వ్యవసాయ పనులు మొదలవుతాయని, విత్తనాల సరఫరా, ఎరువుల పంపిణీ జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.