హైదరాబాద్, నవంబర్12 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ ఏజెన్సీలదేనని, ఒప్పందం ప్రకారం ఆయా సంస్థలే పునరుద్ధరణ వ్యయాన్ని భరించాల్సి ఉంటుందని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) సాయంతో శాస్త్రీయ పద్ధతుల్లో పునరుద్ధరణ పనులను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. ఉన్నతాధికారులు, ఏజెన్సీలతో సచివాలయంలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో బరాజ్‌ల పునరుద్ధరణ అంశాలపై చర్చించారు.
బరాజ్‌ల పునరుద్ధరణ పనుల కోసం అర్హత కలిగిన స్వ తంత్ర సాంకేతిక సంస్థలను నియమించాలని నిర్ణయించామని, సీడబ్ల్యూసీ, ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) సూచనలను పరిగణనలోకి తీసుకుని కొత్త డిజైన్లను రూపొందించాలని సూచించామని వెల్లడించారు. ఐఐటీ అనుబంధ ఏజెన్సీలకు, పుణె సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) ద్వారా జియోఫిజికల్, హైడ్రాలిక్ టెస్ట్‌లు నిర్వహించి నష్టం విలువను అంచనా వేయయడంతోపాటు, చేపట్టాల్సిన పునరుద్ధరణ పనులను తేల్చనున్నామని వివరించారు. సమావేశంలో సాగునీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్, సహాయ కార్యదర్శి కే శ్రీనివాస్ పాల్గొన్నారు.