హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని దివ్యాంగ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడంపై పాఠశాల విద్యాశాఖ దృష్టిసారించింది. ప్రత్యేకంగా నిర్వహిస్తున్న భవిత సెంటర్ల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రంలో 50 వేలకుపైగా దివ్యాంగ విద్యార్థులుండగా, వీరికి ఉత్తమ సేవలందించడానికి 602 భవిత సెంటర్లు ఉన్నాయి. 467 సెంటర్లలో రిసోర్స్సెంటర్లు ఉండగా, ఇందులో దివ్యాంగులకు కావాల్సిన అన్ని రకాల పరికరాలు, ఉపకరణాలను సమకూర్చారు. మరో 135 సెంటర్లలో ఎలాంటి ఉపకరణాలు లేనందున వసతులు కల్పించాలని నిర్ణయించింది. మిగతా సెంటర్లల్లో వసతుల కల్పనకు రూ.50 వేల చొప్పున రూ.67.50 లక్షల నిధులను మంజూరుచేసింది. ఈ నిధులతో మొత్తంగా 33 రకాల సామగ్రి, బోధనోపకరణాలను అందజేస్తారు. కొనుగోలు చేసే ఉపకరణాల జాబితాను సైతం అధికారులు ఖరారు చేశారు.