రాష్ట్రం దివాలా తీసిందని దివానా మాటలు చెప్తున్నవ్.. మరి నీ కుటుంబ ఆస్తులు ఎట్ల పెరుగుతున్నయ్?అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మీ సోదరుడు జగదీశ్వర్‌రెడ్డి స్వచ్ఛ్ బయో కంపెనీ పేరిట వెయ్యి కోట్లు.. మీ అల్లుడు వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎట్ల ముందుకొచ్చిండ్రు? మీ అన్న తిరుపతిరెడ్డి లగచర్లలో లంబాడాల భూములు ఎట్ల గుంజుకుంటున్నడు? దివాలా తీసిన మీ వియ్యంకుడికి చెందిన కంపెనీ అప్పు మీరు అధికారంలోకి రాగానే ఎలా మాఫీ అయింది? మీరు నివాసముంటున్న జూబ్లీహిల్స్ ప్యాలెస్ మూడింతలు ఎట్ల పెరిగింది?
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ 17 నెలల్లో రాష్ట్ర ఆదాయాన్ని ఎందుకు పెంచలేకపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. 2014లో రూ.51,000 కోట్లు ఉన్న రాష్ట్ర ఆదాయాన్ని 2024 నాటికి రూ.2 లక్షల కోట్లకు కేసీఆర్ పెంచారని గుర్తుచేశారు. ‘రాష్ట్ర ఆదాయం ఎందుకు పెరగదు? అనుముల కుటుంబ ఆస్తులు ఎట్లా పెరిగినయి?’ అని నిలదీశారు. ఈ రహస్యాన్ని రాష్ట్ర ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకారం.. పీఆర్సీ, డీఏలు అడిగితే ప్రభుత్వ ఉద్యోగులను ప్రజల ముందు విలన్లుగా చిత్రీకరిస్తారా? అని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో తాము ఉద్యోగులతో కలిసి పోరాటం చేశామని, వారితో తమది పేగుబంధమని పేర్కొన్నారు.
నిన్న రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలు వింటే.. అత్యంత అసమర్థుడు, చేతగాని, పనికిరాని, దక్షతలేని పాలకుడు ఈ దేశంలో ఇంకొకరు లేరని తేలిపోయిందని ఎద్దేవాచేశారు. పాలన చేతగాక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాడి పడేశాడని దుయ్యబట్టారు. రాష్ట్ర భవిష్యత్తుకు శాపం పెట్టేలా సీఎం మాట్లాడిన దారుణమైన మాటలపై కచ్చితంగా సమాధానం ఇవ్వాలని తమ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. అందుకే ఆరోగ్యం బాగలేకున్నా పార్టీ పరంగా వాస్తవాలను ప్రజలకు చెప్పాలనే ఈ ప్రెస్‌మీట్ పెట్టామని వివరించారు. తెలంగాణభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని రేవంత్‌రెడ్డి అవమాన పరిచేలా మాట్లాడారని భగ్గుమన్నారు.
‘వ్యక్తిగతంగా ఎన్ని దూషణలు, తిట్లయినా తింటం.. అవమానాలు సహిస్తం.. ఏడాదిన్నరగా మమ్మల్ని బూతులు తిట్టినా.. చివరికి మా నాయకుడి చావు కోరుకుంటూ నికృష్టపు మాటలు మాట్లాడినా భరించినం.. కోపాన్ని పంటి బిగువున దాచుకున్నం. మమ్మల్ని ఎన్ని తిట్టినా పడుతం.. కానీ, తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడితే మాత్రం సహించేది లేదు’ అని కేటీఆర్ హెచ్చరించారు. వేల మంది త్యాగాలతో దశాబ్దాల పోరాటాల ఫలితంగా ఏ రాజకీయ పార్టీ అందులో లేని నాడు.. రాజకీయ నాయకులు మేలోక ముందే.. టీఎన్జీవోలు, బుద్ధ్దిజీవుల నేతృత్వంలో విద్యార్థి సంఘాలు, కేసీఆర్ నేతృతంలో పోరాటం చేసి చివరకు తెలంగాణ సాధించుకున్నామని గుర్తుచేశారు.
ఎక్కడికి పోయినా దొంగలా చూస్తున్నరని రేవంత్‌రెడ్డి వాపోతున్నడు. మరి దొంగను దొంగలానే చూస్తారు. నోట్ల కట్టలతో దొరికిన దొంగను దొంగే అంటరు. విశ్వసనీయత లేని దొంగను.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగను ఎడ్డి కాంగ్రెస్ పార్టీ సీఎంను చేసింది కానీ, మిగతా ఎవరూ రేవంత్‌రెడ్డిని నమ్ముత లేరు.
-కేటీఆర్
‘నిన్న రేవంత్ మాటలు వింటుంటే స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత అసమర్థుడు, దక్షత లేని పాలకుడు ఈ దేశంలో ఇంకొకరు లేరని తేలిపోయింది. 420 హామీలతో అభయ హస్తం పేరుతో ఇచ్చిన మ్యానిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసమని కూడా తేలిపోయింది. ఢిల్లీ పార్టీలను నమ్మితే గోసపడుతమని కేసీఆర్ అనేక సభల్లో చిలుకకు చెప్పినట్టు చెప్పిండ్రు. ఢిల్లీ పార్టీలను నమ్మి 60 ఏండ్లు గోసపడ్డం.. మళ్లీ ఆ పార్టీలను నమ్మితే మోసపోతమని జాగృతపరిచిండ్రు. నాడు ఎన్నికల సమయంలో ఢిల్లీ పార్టీలను నమ్మితే ఆగమైతమని కేసీఆర్ చెప్పిన ప్రతి మాటా ఇప్పుడు అక్షర సత్యమని రుజువైంది’ అని కేటీఆర్ వెల్లడించారు.
‘నిన్న రేవంత్ మాట్లాడుతూ.. నన్నెవరూ నమ్ముతలేరు.. అప్పు పుడతలేదు.. ఢిల్లీకిపోతే దొంగను చూసినట్టు చూస్తున్నరు.. అపాయింట్మెంట్ కోసం పోతే చెప్పులు ఎత్తుకపోతరేమోనని భయపడుతున్నరు అని అన్నరు. నా రాజకీయ జీవితంలో ఇంత దివాలా కోరు మాటలు ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు. పరిపాలన చేత కాదని రేవంత్ చేతులెత్తేశారు. ఎక్కడికి పోయినా దొంగల్లాగ చూస్తున్నరని వాపోతున్నరు.. మరి దొంగను దొంగలానే చూస్తారు. నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను దొంగే అంటరు’ అని కేటీఆర్ దెప్పిపొడిచారు.
‘తప్పు చేసింది.. దొంగ చేతికి తాళాలిచ్చింది కాంగ్రెస్ పార్టీ. సరిగ్గా మూడేండ్ల క్రితం రాహుల్‌గాంధీ వరంగల్‌కు వచ్చి రైతు డిక్లరేషన్ పేరిట 2 లక్షల రుణ మాఫీ చేస్తం.. రైతుబంధు కింద రూ.15 వేలకు పెంచుతం.. కౌలు రైతులకు రైతుబంధు, రైతుకూలీలకు న్యాయం చేస్తామని చెప్పి మూడేండ్లు దాటింది. కానీ, ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాలేదు. దొంగ చేతికి తాళాలిచ్చి ఇవాళ తెలంగాణ చేతికి చిప్ప వచ్చే పరిస్థితి కల్పించింది రాహుల్ గాంధీనే’ అని కేటీఆర్ విమర్శించారు.
‘సీఎం రేవంత్‌రెడ్డిలో ఎందుకీ ప్రస్ట్రేషన్ అని మా నాయకులమంతా కలిసి మాట్లాడుకుంటూ వచ్చాం.. అధికారంలోకి వస్తామని వారు అనుకోలేదు. అడ్డగోలు హామీలిచ్చారు.. ఇవాళ ఏం చేయాలో తెలుస్తలేదు. మొత్తం నాశనం చేసిండ్రు. వాళ్లతో కాదని తేలిపోయింది. అందుకే ప్రజల నుంచి తప్పించుకొనేందుకు మార్గాలు వెతుక్కుంటున్నరు. దొంగ తప్పించుకోడానికి ఏ మార్గాలైతే వెతుకుతాడో.. ఆ పద్ధతుల్లోనే రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నట్టు కనిపిస్తున్నది’ అని కేటీఆర్ ఫైరయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉద్యోగులకు రేవంత్‌రెడ్డి ఎన్నో హామీలిచ్చారు. కానీ, ఏ ఒకటీ నెరవేర్చలేదు. తెలంగాణ కోసం వారు చేసిన త్యాగం గురించి రేవంత్‌రెడ్డికి ఇసుమంతైనా తెలుసా? నాడు కేసీఆర్ నిరాహార దీక్షకు పోయిందే ఉద్యోగ గర్జన సభ నుంచి. నాడు ఫ్రీ జోన్ హైదరాబాద్ అని తీర్పు వస్తే తెలంగాణ ఉద్యోగులు తిరసరించిండ్రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఎన్జీవోలు ఎంతో గొప్ప ఉద్యమం చేసిండ్రు. ఉద్యమంలో ఉద్యోగులు కదం తొకి రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిండ్రు. వారి ఉద్యమస్ఫూర్తితోనే రాష్ర్టాన్ని సాధించుకున్నం’ అని కేటీఆర్ తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగులకు రేవంత్‌రెడ్డి ఎన్నెన్నో హామీలిచ్చిండు. ఏ ఒకటీ నెరవేర్చలేదు. తెలంగాణ కోసం వారు చేసిన త్యాగం గురించి రేవంత్‌రెడ్డికి ఇసుమంతైనా తెలుసా? నాడు కేసీఆర్ నిరాహార దీక్షకు పోయిందే ఉద్యోగ గర్జన సభ నుంచి.. నాడు ఫ్రీ జోన్ హైదరాబాద్ అని తీర్పు వస్తే తెలంగాణ ఉద్యోగులు తిరసరించిండ్రు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎన్జీవోలు ఎంతో గొప్ప ఉద్యమం చేసిండ్రు. వారి ఉద్యమస్ఫూర్తితోనే రాష్ర్టాన్ని సాధించుకున్నం.
-కేటీఆర్
‘ఏ రాష్ర్టానికైనా ఆస్తులు, అప్పులు వారసత్వంగా వస్తాయి. 2014లో ప్రజల దయతో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. నాడు కాంగ్రెస్ వాళ్లు కూడా మాకు రూపాయి అప్పు లేకుండా ఏమీ ఇవ్వలేదు. అప్పులిచ్చారు.. ఆస్తులూ ఇచ్చారు. 2014లో ప్రభుత్వ లెక్కల ప్రకారం.. రాష్ర్టానికి ఏడాదికి వచ్చే ఆదాయం రూ.51,000 కోట్లు. అంటే నెలకు రూ.4,215 కోట్లు. మేము ప్రభుత్వం నుంచి దిగిపోయే నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఏడాది రాబడి రూ.2,16,567 కోట్లు. అంటే నెలకు రూ.18,000 కోట్లు. రాష్ట్ర ఆదాయం పెరిగలేదా? పెరిగిన ఆదాయంతో కూడిన రాష్ర్టాన్ని మీకు మేము ఇవ్వలేదా? 2014లో ఆనాడు రెవెన్యూ మిగులు (సర్ప్లస్) రూ.369 కోట్లు. మేము దిగిపోయిన నాడు 2023-24లో రూ.4,882 కోట్లు. ఇది మా బీఆర్ఎస్ లెక్కో.. కాకి లెక్కో కాదు. కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) చెప్పిన లెక్క’ అని కేటీఆర్ చురకలంటించారు.
‘రాష్ట్ర ప్రజలు ఒక మౌలికమైన ప్రశ్న అడుగుతున్నరు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్న కరెంట్ ఇప్పడెందుకు వస్తలేదు? కేసీఆర్ ఉన్నప్పుడు మంచినీళ్లు మస్తు వస్తుండె.. ఇప్పుడెందుకు వస్తలేవు? కేసీఆర్ ఉన్నప్పుడు టైమ్‌కు రైతుబంధు పడుతుండె.. ఇప్పుడెందుకు పడ్తలేదు? కేసీఆర్ ఉన్నప్పుడు పెన్షన్లు వస్తుండె.. ఇప్పుడు రెండు రెండు నెలలు ఎందుకు ఎగ్గొడుతున్నరు? కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పిన ప్రతిపనీ చేస్తుండె.. ఇప్పుడెందుకు చేయలేకపోతున్నరు? కేసీఆర్ ఉన్నప్పుడు రాష్ట్రం రయ్యిమని పురోగమనంలో దూసుకుపోయింది? ఇప్పుడెందుకు తిరోగమనంలో పోతున్నదని అడుగుతున్నరు. మీ దగ్గర సమాధానం ఇన్నదా? మీకు చేతనైత లేదు. మీ కాంగ్రెస్ పార్టీకి చేతనైతలేదు’ అని కేటీఆర్ దుయ్యబట్టారు.
‘ఇవాళ మీరు మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలనే ఉద్యోగులు అడుగుతున్నరు. ఆర్టీసీ కార్మికులకు హామీలిచ్చిండ్రు. ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి రెండు పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తమన్నరు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు కల్పిస్తమన్నరు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా హామీలు ఇచ్చిండ్రు. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలు తక్షణమే ఇస్తమన్నరు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ తెస్తమన్నరు. 317 రద్దు చేస్తమన్నరు. కొత్త పీఆర్సీ అమలు చేస్తామన్నరు. రకరకాల మాయ మాటలు చెప్పిండ్రు. మీరు చెప్పినదాన్నే ఇవాళ ఉద్యోగులు అడుగుతున్నరు. గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. పీఆర్సీ, డీఏలు ఏవని అడగుతున్నరు. మీరు ప్రజల ముందు ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరించే కుట్ర చేస్తున్నరు. ఉద్యోగుల తరఫున ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నం.. అందాల పోటీలకు రూ.250 కోట్లు ఉన్నయ్ గాని, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్.. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇచ్చేందుకు పైసల్లేవా? ఇదేనా మీ ప్రభుత్వం? ఇదేనా మీ ప్రాధాన్యం?’ అని కేటీఆర్ నిలదీశారు.
‘ప్రభుత్వమనేది నిరంతర ప్రక్రియ. ముఖ్యమంత్రులు మారుతుంటారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి అయ్యారు. రేపు ఇంకెవరో అవుతారు. అధికారం బదలాయింపు జరిగినప్పుడు కచ్చితంగా ఆస్తులు వస్తాయి.. అప్పులు వస్తాయి. ప్రతి ప్రభుత్వం మన ఆస్తులెంత? అప్పులెంత? ఏరకంగా ముందుకెళ్లాలి? నిర్మాణాత్మకంగా ఆలోచించి చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే చేస్తదని మేము ఆశించినం. ప్రజలు కూడా ఆశించిండ్రు. ఇవాళ ఎంత దుర్మర్గమంటే ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నరు.
మొదలు పెట్టుడు మొదలు పెట్టుడే అబద్ధాల జాతర మొదలు పెట్టిండ్రు. 2023 డిసెంబర్లో మొదట శ్వేతపత్రం పెట్టినప్పుడు బీఆర్ఎస్ రూ.6 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. నిన్ననేమో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8.29 లక్షల కోట్ల అప్పు చేసిందంటున్నారు. అప్పుల సంఖ్య రోజురోజుకూ మారుతదా? రేవంత్‌రెడ్డి సరారును నడుపుతున్నరా? లేక సరస్‌ను నడుపుతున్నరా? రూ.6 లక్షల కోట్లని చెప్పింది మీరే.. ఇవాళ రూ.8.29 లక్షల కోట్లని అబద్ధం చెప్తున్నదీ మీరే? బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.4.17 లక్షల కోట్లు మాత్రమే. ఏడాదికి మేము చేసిన అప్పు రూ.40వేల కోట్లు మాత్రమే’ అని కేటీఆర్ వివరించారు.
కల్పతరువులాంటి కాళేశ్వరాన్ని కట్టి ధాన్యం పండించడంలో తెలంగాణను పంజాబ్, హర్యానా కంటే ముందు నిలబెట్టిండ్రు.
వలసల జిల్లాగా పేరొందిన పాలమూరు గోస తీర్చేందుకు పాలమూరు-రంగారెడ్డి పథకం చేపట్టి 90 శాతం పూర్తిచేసిన్రు..కానీ మీరు మోటర్లు కూడా ఆన్ చేయలేదు.
రూ.30 వేల కోట్లతో మిషన్ భగీరథ పథకం తెచ్చి ఇంటింటికీ మంచినీళ్లిచ్చిన్రు. నువ్వు కనీసం ఆ ప్రాజెక్టును నడుపలేకపోతున్నవ్.
లక్ష విద్యుత్తు మెగావాట్ల లోటుతో ఉన్న తెలంగాణను 24 గంటలుకరెంటిచ్చి వెలుగు జిలుగుల తెలంగాణగా మార్చిన్రు.
రైతుబంధు పథకం తెచ్చి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు జమజేసిన్రు. రూ.29,000 కోట్ల రైతుల అప్పు తీర్చిన్రు. 24 గంటల కరెంటిచ్చి 60 వేల కోట్ల భారాన్ని దింపిన్రు.
హైదరాబాద్‌లో 36 ఫై ఓవర్లు కట్టిన్రు. హైదరాబాద్ మెట్రో మొదటి దశ పూర్తిచేసిన్రు. ఓ అఖండమైన సెక్రటేరియట్‌ను కట్టిన్రు. ఓ అద్భుతమైన 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించిండ్రు. తెలంగాణ అమరుల స్మారకార్థం అమరజ్యోతిని నిర్మించిండ్రు.
32 మెడికల్, 32 నర్సింగ్ కాలేజీలు పెట్టిండ్రు. 1022 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిండ్రు. ఊరూరికీ రైతువేదిక కట్టిండ్రు. పల్లెపల్లెనా డంపింగ్ యార్డు, ప్రకృతివనం, వైకుంఠధామం కట్టిండ్రు. 32 జిల్లాల్లో కలెక్టరేట్లు కట్టిండ్రు. ఆఖరికి మీరు అందాల పోటీలపై రివ్యూ చేస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా కేసీఆరే కట్టిండ్రు.
17 నెలల్లో రూ.1.7 లక్షల కోట్ల అప్పుతెచ్చి ఒక్క ఇటుకైనా పేర్చినవా? ఒక్క మంచిపనైనా చేసినవా?
‘నన్ను కోసుకొని తింటరా? వండుకొని తింటరా? అని అంటున్నడు ముఖ్యమంత్రి.. అయ్యా ముఖ్యమంత్రి.. నిన్ను కోసుకొని తినేవాళ్లు ఎవరూ లేరు. నీ దివాలా కోరు విధానాలతో రాష్ర్టాన్ని మీరే కాల్చుకతింటున్నరు. రాష్ర్టాన్ని ఏడాదిన్నరగా రాచిరంపాన పెడతున్నరు. ఇది వాస్తవం. మీరేమైనా కోత మామిడి కాయవా కోస్క తినడానికి?’ అని కేటీఆర్ దెప్పిపొడిచారు.
‘కేసీఆర్ హయాంలో.. బీఆర్ఎస్ పాలనలో దేశానికి తెలంగాణ రోల్‌మాడల్ ఎట్లా అయింది.. నేడు ఎందుకు దివాలా తీస్తున్నది? కారణం ఒక్కటే.. అది నాయకత్వ లోపం. కాంగ్రెస్ తెలంగాణకు పట్టిన శాపం. మార్పు పేరుతో చేసిన దుర్మార్గం. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా తాను పాలిస్తున్న రాష్ర్టానికి ఇన్ని శాపాలు పెట్టలేదు. ఎయిడ్స్ పేషెంట్ అంటివి. క్యాన్సర్ పేషెంట్ అంటివి. దివాలా తీసిందంటివి. అప్పు పుడతలేదంటివి. నీ దివాలా కోరు మాటలు, నీ ప్రభుత్వ దివాలా కోరు విధానాలే రాష్ట్రం పాలిట శాపంగా మారినయి. సీఎం రాష్ర్టానికి తండ్రి లాంటి వాడు. సంపద పెంచాలి. రాష్ర్టానికి, ముఖ్యంగా పేదలకు పంచాలి. కానీ, దివాలా తీసింది.. పోయింది.. అంటున్నరు’ ఇదేనా పాలించే పద్ధతి? అని నిలదీశారు.
నిన్న రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తుంటే.. అత్యంత అసమర్థుడు, చేతగానివాడు, పనికిరాని, దక్షతలేని పాలకుడు ఈ దేశంలో ఇంకొకరు లేరని తేలిపోయింది. పాలన చేతగాక కాడిపడేసిండు. 420 హామీలతో ఇచ్చిన మ్యానిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసమని కూడా తేలిపోయింది.
-కేటీఆర్
‘2020లో మంత్రిగా భారతదేశాన్ని సాదుతున్న రాష్ర్టాల్లో, జాతి నిర్మాణంలో దోహదపడుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటని చెప్పిన. అందుకు సంబంధించిన వివరాలను నవంబర్‌లో ట్వీట్లో వెల్లడించిన. 2014 నుంచి 2020 నవంబర్ వరకు రూ.2.73 లక్షల కోట్లు పన్నుల రూపంలో మనం కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే, మనకు కేంద్రం నుంచి వచ్చింది కేవలం రూ.1.40 లక్షల కోట్లు. దేశంలోని వెనుకబడిన రాష్ర్టాలకు ఇతోదిక సాయం అందిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి. అందుకే ఈ లెక్క చెప్తున్న’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
‘కేసీఆర్ పదేండ్ల్లలో ఏడాదికి రూ.41 వేల కోట్ల చొప్పున పదేండ్లలో రూ.4.17 లక్షల కోట్లు అప్పుజేసి ఒక్కో ఇటుక పేర్చుకుంటూ రాష్ర్టానికి శాశ్వతంగా పనికొచ్చే ఆస్తులు సృష్టించిండ్రు. మరి మీరేం చేస్తున్నరు? 17 నెలల్లో ఒక్క ఇటుకనైనా పేర్చినరా? ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినరా? ఒక్క కాలువ కట్టినరా? ప్రాజెక్టు కట్టినరా? హైదరాబాద్‌లో ఓ బిల్డింగ్ కట్టినరా?’ అని కేటీఆర్ నిలదీశారు.
‘రాష్ట్రం దివాలా తీసిందని చెప్తున్న మీరు మీ కుటుంబం ఆస్తులు ఎట్ల పెరుగుతున్నయో చెప్పు. మీ అన్న జగదీశ్వర్‌రెడ్డి స్వచ్ఛ్ బయో కంపెనీ పేరిట వెయ్యి కోట్లు..మీ అల్లుడు వెంకటనర్సింహారెడ్డి వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎట్ల ముందుకొచ్చిన్రు? మీ అన్న తిరుపతిరెడ్డి లగచర్లలో గిరిజనుల భూములు గుంజుకుంటున్నడు. దివాలా తీసిన మీ వియ్యంకుడి కంపెనీ అప్పు ఎట్లా మాఫీ అయింది? మీరు నివాసముంటున్న జూబ్లీహిల్స్ ప్యాలెస్ మూడింతలు ఎట్లా పెరిగింది?’ అని కేటీఆర్ దుయ్యబట్టారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఎకడా లేని విధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే తెలంగాణ ఉద్యోగుల జీతాలు ఎకువుండాలని చెప్పి కేసీఆర్ 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చిండ్రు. ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ కూడా ఇచ్చిండ్రు. ఎందుకంటే ఉద్యోగులే ఉద్యమకారులై కదం తొక్కిండ్రు కాబట్టి. పెన్‌డౌన్ చేసిండ్రు. సకల జనుల సమ్మె చేసి తెలంగాణ కోసం కొట్లాడిండ్రు. కానీ, ఇవాళ వారిని రేవంత్ అవమానించిండు. రాష్ట్ర ప్రజలతో వారికి చిచ్చుపెడుతున్నాడు. నాడు మేము ఉద్యోగులతో భుజం భుజం కలిపి ఉద్యమం చేసినం. వారితో మాది పేగుబంధం. అందుకే తెలంగాణ రాగానే ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకున్నం. ఉద్యోగ సంఘాల నాయకులకు కీలక పదవులు ఇచ్చినం. మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు అయ్యిండ్రు. ఉద్యోగ నేతలకు కేసీఆర్ అనేక పదవులు ఇచ్చి గౌరవించిండ్రు’ అని కేటీఆర్ గుర్తు చేశారు.
ఆశ కార్యకర్తలకు 18 వేల జీతం పెంచుతానని చెప్పింది మీరుకాదా? అంగన్వాడీల జీతం పెంచుతానన్నది మీరు కాదా? అదే ఆశ కార్యకర్తలు హైదరాబాద్‌లో ధర్నాలు చేస్తే చీరెలు చింపుకుంటా..గుజ్జుకుంటా సెక్రటేరియట్ ఎదుట దుశ్సాసన పర్వానికి తెరలేపింది మీ సర్కారు కాదా?
-కేటీఆర్
‘వెల్దండ నుంచి ఫోర్త్ సిటీ దాకా 2000 ఎకరాల భూమిని మీరు.. మీ బినామీలు అక్రమించుకున్నది నిజంకాదా? రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టే స్థోమత లేని మీ బావమరిది సృజన్‌రెడ్డి కంపెనీకి రూ.11000 కోట్ల కాంట్రాక్ట్ అప్పజెప్పింది అవాస్తవమా? రాష్ట్రం దివాలా తీస్తుంటే మీ అన్న, అల్లుడు, వియ్యకుండు, బావమరిది ఆస్తులు ఎలా పెరిగినయ్?. ఈ సిక్రెట్ ఏమిటో ప్రజలకు చెప్పు రేవంత్‌రెడ్డీ.. రాష్ట్రం అప్పుల గురించి కాదు.. మీ అల్లుడు, బావమరిది, వియ్యంకుడి ఆస్తులు ఎలా పెరిగినయో.. తెలంగాణ ఆస్తులు ఎట్ల తగ్గుతున్నయో..అనుముల ఆస్తులు ఎట్ల పెరుగుతున్నయో కచ్చితంగా చెప్పాలె’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
‘ఎక్కే విమానం..దిగే విమానం తరహాలో 43 సార్లు ఢిల్లీకి వెళ్లి ఏం జేసినవ్? ఎకానామీ క్లాస్‌లో ప్రయాణించిన అని అబద్ధం చెప్తున్నవ్.. నువ్వు పోయినప్పుడల్లా వందిమాగధులు, బ్రోకర్లను వెంట తీసుకుపోలేదా? ఢిల్లీకి పోయినందుకైన ఖర్చెంత? నీ మంత్రులు నల్లగొండకు కూడా హెలికాప్టర్లో పోతున్నరు.. హెలికాప్టర్‌ను షేర్ ఆటోలెక్క వాడుతున్నరు. ఒకరినొకరు కొట్టుకుంటున్నరు. భువనగిరిలో జరిగిన ఎమ్మెల్యేల బర్త్‌డే వేడుకలకు కూడా గాలిమోటర్లనే పోతున్నరు. మీరు.. మీ మంత్రులు ఫ్లైట్లు, హెలికాప్టర్లలో తిరిగేందుకు పెట్టిన ఖర్చెంత? ముఖ్యమంత్రి వెళ్లేదేమీ ఎకానమీ క్లాస్ కాదు. ఏడు విదేశీ యాత్రలు.. ప్రైవేట్ జెట్లు..క్లాసైన ఫైట్లు అందరికీ తెలిసినవే.. మేం చెప్పింది అబద్ధమైతే వెంటనే శ్వేతపత్రం విడుదల చెయ్యాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్న ఉద్యోగులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవమానిస్తున్నారని కేటీఆర్ నిప్పులు చెరిగారు. ‘వాళ్ల న్యాయమైన కోరికలను గొంతెమ్మ కోరికలు అంటున్నరు..డీఏలు, పీఆర్సీలు ఇస్తమని చెప్పిన మీరే అడ్డమైన మాటలు మాట్లాడుతున్నరు.. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజల రెక్కల కష్టంతో వచ్చిన ఆదాయాన్ని మీ ఖాతాలో వేసుకుంటున్నరు..ఢిల్లీకి మూటలు పంపుతరు..ఉద్యోగులను మాత్రం ప్రజల దృష్టిలో చులకనజేసి మాట్లాడుతున్నరు’ అని మండిపడ్డారు. ఉద్యోగ సంఘాలు కూడా ముఖ్యమంత్రి ఆలోచనా విధానాన్ని ఆర్థం చేసుకోవాలని కోరారు.
ఉద్యోగులు జీతాలు అడగొద్దు..ఆర్టీసీ సిబ్బంది అపాయింటెడ్ డే అడగొద్దు..ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు జీతాలు పెంచాని కోరొద్దు.. ప్రజలు ఆరు గ్యారెంటీలను అడగొద్దు..420 హామీల గురించి అడగొద్దు.. అంతేనా?
-కేటీఆర్
‘ఆనాడు మీరే అంటివి.. కేసీఆర్ లీటర్ పెట్రోల్, డిజీల్లో రూ.30 ఏసుకపోతుండని..ఇప్పుడేమో రూ. 200 చేస్తా అనవడ్తివి.. ధరలు పెంచుడు కాదు.. ముందు మీ బుర్ర పెంచుకో..సంపద పెంచే ఆలోచన చెయ్యి..అడ్డమైన మాట్లాడులు బంద్ చెయ్యి’ అంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘పెద్ద హోదా వచ్చినప్పుడు దానికి తగ్గట్టు ప్రవర్తించే వ్యక్తిత్వం ఉండాలె..తెలంగాణ తెచ్చిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చావును నిరంతరం కోరుకుంటున్నరు.. మీరు ముఖ్యమంత్రా? ఇంతకంటే హీనమైన మనిషి ఉంటడా?’ అని నిప్పులు చెరిగారు. ‘71 ఏండ్ల పెద్దమనిషిని సిగ్గు ఎగ్గూ లేకుండా ఎన్నిసార్లు దూషిస్తివి? ఇప్పుడు ఉద్యోగుల వెంట పడ్తున్నవు.. కేసీఆర్ వెంట నడిచిన వారిని మీ కోసం మీ పార్టీ అవసరాల కోసం మోసం చెయ్యకు.
ఇగ ముఖ్యమంత్రి, మంత్రులు నేడో రేపో ప్రెస్‌మీట్ పెట్టి డీఏలు..పీఆర్సీలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చుడు కాదు..మా పరిస్థితి బాగాలేదు కేసీఆర్ పెంచిన 73 శాతం జీతాలను రికవరీ యాక్ట్ కింద వెనుకకు తీసుకుంటం.. మళ్లా పాతరోజుల్లోకి వెళ్లిపోతం అనడం గ్యారెంటీ’ అని దెప్పిపొడిచారు. ‘ముసలోళ్లకు కేసీఆర్ ఇచ్చిన రెండు వేల పింఛన్ కాదు.. మళ్లా 200 తీసుకోన్రి.. మిగిలినయి వాపస్ ఇవ్వుండ్రి.. ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, నేతన్నలను కూడా తిరిగివ్వుమనుడు ఖాయం.. ఆఖరికి ప్రభుత్వం నడిపేందుకు చందాలివ్వుమని అడిగినా ఆశ్చర్యపోనక్కరలేదు’ అని ఎద్దేవాచేశారు.
తమ దగ్గర పైసల్లేవని, తమను ఎవరూ నమ్ముతలేరని..చెప్పులెత్తుకపోరని బీద అరుపులు అరుస్తున్న ముఖ్యమంత్రి అదే నోట తెలంగాణ రైజింగ్.. అందాల పోటీలు.. మూసీని లక్ష కోట్లతో పూర్తిచేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉన్నదని కేటీఆర్ విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, వృద్ధుల పింఛన్లు, ఆడబిడ్డలకు స్కూటీలకు పైసల్లేవని చెప్తున్న ముఖ్యమంత్రి మింగమెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె చందంగా సోకులకు మాత్రం లక్షల కోట్లు వెచ్చిస్తున్నారని మండిపడ్డారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ముఖ్యమంత్రిని వదిలిపెట్టబోమని..హామీలు అమలు చేసేదాకా వెంట పడుతామని హెచ్చరించారు. ‘నిజంగా పాలన చేయడం చేతగాకుంటే తప్పుకో..ఢిల్లీకి మూటలు పంపుడు అయితలేదు.. దివాలా తీసిన అని ఐపీ పెట్టి వెళ్లిపో.. అంతేగానీ తెలంగాణను బద్నాం చేసినా.. కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషించినా ఇకమీదట ఊరుకునేది లేదు.. నీ నాలుక చీరేసే రోజు వస్తది’ అని తీవ్రంగా హెచ్చరించారు. ఎట్టిపరిస్థితుల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని అధికారం చేపట్టేది కేసీఆరేనని, రాష్ర్టాన్ని గాడిన పెట్టేది ఆయనేని స్పష్టంచేశారు.
మీరు మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలనే ఉద్యోగులు అడుగుతున్నరు. ఆర్టీసీ కార్మికులకు హామీలిచ్చిండ్రు. ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి రెండు పీఆర్సీలు వెంటనే చెల్లిస్తమన్నరు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వసతులు కల్పిస్తమన్నరు. ఉద్యోగులకు మూడు డీఏలు తక్షణం ఇస్తామన్నరు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ తెస్తమన్నరు. 317 జీవోను రద్దు చేస్తమన్నరు. కొత్త పీఆర్సీ అమలు చేస్తామన్నరు. మీరు చెప్పిందే ఉద్యోగులు అడుగుతున్నరు. వాళ్లేం గొంతెమ్మ కోరికలు కోరుతలేరు. మీరు మాత్రం ప్రజల ముందు ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరించే కుట్ర చేస్తున్నరు.
-కేటీఆర్
‘తెలంగాణ ఆర్థిక పరిస్థితి అంతా బాగున్నది. అప్పులు ఎక్కువున్న రాష్ర్టాల్లో పై నుంచి కిందికి 24వ స్థానంలో ఉన్నది. ఇది నేను చెప్తున్న లెక్కకాదు.. పార్లమెంట్ సాక్షిగా కేంద్రం వెల్లడించిన లెక్కలు’ అని విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి చేతగాక అప్పుల పేరిట తప్పించుకునేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. ‘నాడు అధికారం కోసం ఉద్యోగులు, ప్రజలకు అడ్డమైన హామీలిచ్చారు. మాకు 125 ఏండ్ల చరిత్ర ఉన్నదని..ఆదాయం పెంచడం అందరికీ పంచడం తమకు తప్ప మరొకరికి తెలియదని డప్పు కొట్టుకున్నారు. ఇప్పుడేమో చేతగావడం లేదని చేతులెత్తేస్తున్నారు.
దివాలా తీసింది రాష్ట్రం కాదు..కాంగ్రెస్సోళ్ల బుర్రలు’ అని కేటీఆర్ విమర్శించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయాలని కోరుకోవడంలేదని, కానీ ప్రభుత్వం వారికిచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమ్మె చేస్తామంటున్న ఉద్యోగులను బద్నాం చేయవద్దని హితవు పలికారు. ‘రేవంత్‌రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏరంగం కూడా స్థిరంగా లేదు. చివరికి ఆయన కుర్చీకూడా స్థిరంగా లేదు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. చివరికి ముఖ్యమంత్రిదీ అదే పరిస్థితి.. ఆయన అపరిచితుడు. రాములా ఓ రకంగా..రెమోలా ఇంకోలా మాట్లాడుతరు’ అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా పనికిమాలిన పలుకులు ఆపి పాలనపై దృష్టిపెట్టాలని సూచించారు. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నాయకులున్నారు.
‘రాష్ట్రం ఆర్థికంగా బాగాలేకపోతే.. ఎవ్వరూ బజార్ల నమ్మకపోతే.. చెప్పులు ఎత్తుకుపోయే వాళ్లను చూసినట్టు చూస్తే.. ముఖ్యమంత్రి డబ్బా కొట్టుకుంటున్నట్టు జపాన్, దావోస్ పర్యటనలతో 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఎట్లా సాధించినట్టు? మరి దివాలా అబద్ధమా? పెట్టుబడులు అబద్ధమా?’ అని నిలదీశారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసిన వరంగల్ జిల్లా నేతలను కేటీఆర్ తెలంగాణ భవన్లో అభినందించారు. వారిలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డితోపాటు వాసుదేవారెడ్డి, రాఘవ, అమృత్ చౌహాన్ ఉన్నారు.