Jampanna Vagu | ఏటూరునాగారం, ఆగస్టు 26 : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని ఎలిశెట్టిపల్లి వాసులు జంపన్నవాగు దాటాలంటే ట్రాక్టర్ టైర్ (ట్యూబ్లో గాలి నింపి)ను పట్టాల్సిందే. గత నెల మొదటి వారంలో వర్షాలు కురవడంతో ఎలిశెట్టిపల్లి వాసుల రాకపోకల కోసం బోటు ఏర్పాటుచేశారు. ఆ తర్వాత వాగు తగ్గడంతో అధికారులు అక్కడ నుంచి బోటును తరలించారు. అప్పడప్పుడు కురుస్తున్న వర్షాలకు నీరు చేరడంతో జంపన్నవాగు దాటి రావడానికి ఎలిశెట్టిపల్లి వాసులు ఇబ్బంది పడుతున్నారు.
కొంతమంది తాడు కట్టిన ట్రాక్టర్ టైరును పట్టుకుంటే మరికొందరు దానిని లాగుతూ ఒడ్డుకు తీసుకొస్తున్నారు. అలాగే మరికొంత మంది ఈత కొట్టుకుంటూ వాగు దాటుతున్నారు. ఇలాంటి సాహసాలు ప్రమాదకరమని తెలిసినప్పటికీ అవసరాల రీత్యా తప్పడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే బోటు ఏర్పాటు చేసి రవాణా సౌకర్యం కల్పించాలని ఎలిశెట్టిపల్లి వాసులు కోరుతున్నారు.