జగిత్యాల, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాలను ప్రక్షాళన చేస్తామని, ప్రతి గురుకులంలో సకల సదుపాయాలు కల్పించి, సురక్షిత విద్యాకేంద్రాలుగా మారుస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పక్షం రోజుల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు మృతిచెందడం, మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి, రవాణా శాఖ మం త్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మంగళవారం పెద్దాపూర్ గురుకులాన్ని సందర్శించారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులను ఓదార్చి వారితో స మావేశమయ్యారు. మృతిచెందిన పిల్లల తల్లిదండ్రులు, తీవ్ర అస్వస్థతకు గురై కోలుకున్న పిల్లల తో మాట్లాడారు. అనంతరం భట్టి మాట్లాడుతూ పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మృతి యావత్ ప్రభుత్వాన్ని కలచివేసిందని, మంత్రి మండలి సభ్యులందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు.
ఘటనలు జరగకుండా చూస్తాం
ఇకముందు ఇలాంటి దుర్ఘటనలు ఎక్కడా చోటుచేసుకోకుండా చూస్తామని ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నామని తెలిపారు. గురుకులాలకు పకా భవనాల కోసం బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించినట్టు తెలిపారు. మానవ వనరుల అభివృద్ధి కోసం విద్యకు పెద్దఎత్తున నిధులు కేటాయించామని చెప్పారు. పెద్దాపూర్ పాఠశాల భవనానికి రూ.50 లక్షలు కేటాయిస్తున్నట్టు చెప్పారు. పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మించి ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని కలెక్టర్‌ను ఆదేశించినట్టు తెలిపారు. గురుకులాల్లో విద్యార్థులకు హెల్త్‌కార్డు పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ప్రతి గురుకులంలో అత్యవసర ఔషధాలు, పారామెడికల్ స్టాఫ్, కుక, పాము కాటు మందులను అందుబాటులో ఉంచాలని గురుకులాల సెక్రటరీ రమణకుమార్‌ను ఆదేశించారు. ప్రతి హాస్టల్లో రుచిగల ఆహారం అందిస్తూ శుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని, హాస్టళ్లలో మంచం, బెడ్ షీట్ల కోసం ప్రతిపాదనలు పంపాలని సూచించారు. టాయిలెట్స్, నీరు, విద్యు త్తు, భద్రతకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.
బాధిత కుటుంబాలకు ఉద్యోగం
మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులకు గురుకులాల్లో ఉద్యోగం కల్పిస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. ఎక్స్‌గ్రేషియా సైతం ఇస్తామని చెప్పారు. కుటుంబాలకు ఇండ్లు లేకపోతే వారికి రూ.5 లక్షల ప్రభుత్వ సాయం అందించాలని కలెక్టర్‌కు సూచించినట్టు తెలిపారు. గురుకులాలతోపాటు, హాస్టళ్లలో విద్యార్థులకు ఇచ్చే డైట్చార్జీల పెంపుపై త్వరలోనే కమిటీ వేస్తామని, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా డైట్ చార్జీల పెంపు ఉంటుందని వివరించారు. సమావేశం అనంతరం గురుకులం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్‌లు, ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, డాక్టర్ సంజయ్‌కుమార్, సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణ భాస్కర్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్ పాల్గొన్నారు.
కుటుంబాల ఆవేదన.. ఆగ్రహం..
పెద్దాపూర్ గురుకులంలో డిప్యూటీ సీఎం భట్టితో సమావేశమైన బాధిత పిల్లల కుటుంబ సభ్యులు, ఇతర పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తంచేశారు. డిప్యూటీ సీఎం వస్తున్న విషయాన్ని సోమవారం రాత్రి ప్రకటించారు. మృతిచెందిన చిన్నారుల కుటుంబ సభ్యులతోపాటు, పిల్లల తల్లిదండ్రులతో మంత్రులు మాట్లాడుతారని ముందే ఆదేశాలిచ్చినా, జిల్లా అధికారయంత్రాంగం, గురుకుల పాఠశాలల యాజమాన్యం ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయి. కొద్ది మంది పిల్లల కుటుంబసభ్యులకే సమాచారమిచ్చి చేతులు దులుపుకొనేందుకు యత్నించారు. అయినా, విషయం తెలుసుకున్న చాలా మంది తల్లిదండ్రులు గురుకులానికి చేరుకున్నారు. కానీ, వారిని డిప్యూటీ సీఎం, మంత్రులతో కలువనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర నిరసన వ్యక్తమైం ది. ఒకానొక దశలో కొందరు పిల్లల తల్లిదండ్రులను, కోరుట్ల సీఐ కాలర్ పట్టుకొని, గదుల నుంచి బయటకు లాక్కెళ్లడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి భట్టి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సర్దిచెప్పి నిర్వహించిన సమావేశంలోనూ తల్లిదండ్రులు ఆవేదనతోనే మాట్లాడారు.
హంగామాకు వచ్చారా?
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన తీరు పై పెద్దాపూర్ గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తంచేశారు. చనిపోయిన పిల్లల తల్లిదండ్రులను పరామర్శించేందుకు డిప్యూటీ సీఎం వస్తున్నప్పటికీ ప్రొటోకాల్ అంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ‘గాడ్ ఆఫ్ హానర్’ అందరినీ విస్మయానికి గురిచేసింది. వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చి ప్రజాప్రతినిధులకు బొకేలు, శాలువాలు ఇస్తూ హంగామా చేయడంతో బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. తమను పలుకరించి, దైర్యం కల్పించేందుకు వచ్చారా? బొకేలు తీసుకొని, శాలువాలు కప్పుకొంటూ హంగామా చేసేందుకు వచ్చారా? అంటూ వారు బాహాటంగానే విమర్శించారు.
సరారు మొద్దునిద్ర వీడినందుకు సంతోషం
సర్కారు మొద్దునిద్ర వీడి, గురుకులాల సమస్యలపై మొత్తానికి స్పందించటం సంతోషంగా ఉన్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. 8 నెలల్లో కలుషిత ఆహారం కారణంగా దాదాపు 500 మందికిపైగా విద్యార్థులు దవాఖానల పాలవడం, సోమవారం కూడా సంగారెడ్డి జిల్లాలోని బీబీపేట ప్రభుత్వ పాఠశాలలో కలుషిత ఆహారంతో 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయాన్ని ఆయన ఉదహరించారు. విద్యార్థుల భోజన సమస్యలను పరిషరించాలని కేటీఆర్ డిమాండ్ చేసిన వి షయం తెలిసిందే. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, మంత్రి పొన్నం ప్రభాకర్ జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ పాఠశాలను సందర్శించడాన్ని కేటీఆర్ స్వాగతించారు. విద్యార్థుల భోజనం సహా ఇతర అన్ని సమస్యలను పరిషరించేలా మంత్రులు కృషిచేయాలని కోరారు.