Telangana | హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లోని త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో రూ.12,000 కోట్ల రుణాల సమీకణకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకు ప్రతిపాదనలు పంపింది. జూలై 1న నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలంలో రూ.1,500 కోట్ల అప్పు తీసుకుంటామని తెలిపింది. ఇందులో 24 ఏండ్ల కాలపరిమితితో 800 కోట్ల రూపాయలు, 30 ఏండ్ల కాలపరిమితితో మరో 700 కోట్ల రూపాయలు తీసుకుంటామని పేర్కొన్నట్టు శుక్రవారం ఆర్బీఐ వెల్లడించింది.
జూలైలో 4 దఫాలుగా మొత్తం రూ.4,500 కోట్లు, ఆగస్టులో 3 దఫాల్లో రూ.3,500 కోట్లు, సెప్టెంబర్లో 4 దఫాల్లో రూ.4,000 కోట్ల రుణం తీసుకునేందుకు ఇండెంట్ పెట్టినట్టు తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్ నుంచి మొత్తం రూ.64,539 కోట్ల రుణాలు సమీకరిస్తామని బడ్జెట్లో పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం.. తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 14 వేల కోట్ల రూపాయల రుణం కోసం ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపించింది. కానీ, అంతకంటే 3,400 కోట్ల రూపాయలు ఎక్కువగా 17,400 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది.