Gurukula Transfers | హైదరాబాద్, ఆగస్టు26 (నమస్తే తెలంగాణ): సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీలో నిర్వహించిన బదిలీలు, ప్రమోషన్లలో రిజర్వేషన్లను సైతం అటకెక్కించారు. డిసెండింగ్ ఆర్డర్లో ప్రమోషన్లను నిర్వహించి, జనరల్ కోటా పోస్టులను తొలుత భర్తీ చేసి అనంతరం రిజర్వేషన్ కోటాని నింపాల్సి ఉండగా అందుకు ్తవిరుద్ధంగా ప్రక్రియను చేపట్టారు.
గురుకుల డిగ్రీ కాలేజీలకు సంబంధించిన బదిలీలు, పదోన్నతులనైతే అడ్డదిడ్డంగా చేశారని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. సొసైటీకి సంబంధించి 2020లో మొత్తంగా 19 డిగ్రీ ప్రిన్సిపాల్ పోస్టులను నోటిఫై చేశారు. అందులో ఓసీ 8, ఎస్సీ 4, ఎస్టీ 2, బీసీ(ఏ) 2, బీసీ(బీ) 1, దివ్యాంగులకు 2 ప్రకటించారు. కానీ ఆ నోటిఫికేషన్లో ఓసీ 6, ఎస్సీ 1, బీసీ(ఏ) 1 మొత్తంగా 8 పోస్టులను మాత్రమే భర్తీ చేశారు.
11 డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ పోస్టులు మిగిలిపోయాయి. అందులో ఓసీ 2, ఎస్సీ 3, ఎస్టీ 2, బీసీ(ఏ) 1, బీసీ(బీ) 1, దివ్యాంగుల కోటా 2 ఉన్నాయి. ఇవన్నీ కూడా నోటిఫైడ్ పోస్టులు. కానీ సొసైటీ ఉన్నతాధికారులు మాత్రం ఈ నోటిఫైడ్ పోస్టులను సైతం జనరల్ కన్వర్షన్ చేసి నింపారు. ఆ 11 పోస్టులతోపాటు మరో 6 కలిపి మొత్తంగా 17 డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ పోస్టులను 100 శాతం ప్రమోషన్ల ద్వారానే, అదీ నిబంధనలకు విరుద్ధంగానే భర్తీ చేసింది. అందులో బీసీ (ఏ), దివ్యాంగుల కోటా లేకుండా చేశారు.
సొసైటీలో అర్హులైన మహిళలు లేకుంటే 30% ప్రమోషన్ కోటా లో 50 ఏండ్లు దాటిన పురుష అభ్యర్థులకు ప్రమోషన్ ఇవ్వొచ్చు అన్న నిబంధన ఉన్నది. అయితే, ఒక మహిళా అధ్యాపకురాలు సొంతంగా జాతీయ స్థాయి రిసెర్చ్ ప్రాజెక్టులను పూర్తిచేసినా.. ఆమెను పక్కనబెట్టి డిగ్రీ కాలేజీలో 5 ఏండ్ల బోధన అనుభవం కూడా లేని ఓ పురుష అభ్యర్థికి 30 శాతం కోటా కింద ప్రమోషన్ కల్పించడం గమనార్హం.