Reservations | హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ముగుస్తుండటంతో రిజర్వేషన్లపై ఆసక్తి నెలకొన్నది. తెలంగాణలో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చాక ఒకసారి అమలు చేసిన రిజర్వేషన్లను రెండుసార్లు కొనసాగించాలని చట్టంలో పొందుపర్చారు. ఈ చట్టం వచ్చాక రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలు పెద్ద సంఖ్యలో ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త వాటికి రిజర్వేషన్ ఎలా అమలు చేస్తారనే దానిపై చర్చ మొదలైంది. చట్టంలో ఒకే రిజర్వేషన్‌ను రెండు టర్మ్‌లు అమలు చేయాలని ఉండటంతో కొత్త స్థానిక సంస్థల సంగతేమిటి? బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారు? మొత్తంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఎలా ఉంటాయి? అనే అంశాలపై రాజకీయ నాయకుల్లో జోరుగా చర్చ సాగుతున్నది.
కొత్త స్థానిక సంస్థలకు కొత్త రిజర్వేషన్లు అమలు చేస్తే అప్పటికే ఆ మండలం, ఆ జిల్లాలో ఉన్న రిజర్వేషన్ల శాతంలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉండటంతో వాటిని ఎలా సరిచేస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, ఈ రిజర్వేషన్లపై నిపుణులు, అధికారులు మాత్రం భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పటికే ఉన్నవాటికి రిజర్వేషన్లు మారవని, పంచాయతీరాజ్ చట్టంలో రెండుసార్లు రిజర్వేషన్ అమలు చేస్తామని ఉన్నందున కొత్త వాటిని యూనిట్‌గా తీసుకొని జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించే అవకాశం ఉంటుందని ఓ అధికారి తెలిపారు. బీసీలకు అమలు చేసే రిజర్వేషన్ శాతం, కొత్త స్థానిక సంస్థల రిజర్వేషన్లంన్నింటిపై న్యాయసలహా తీసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుందని మరో అధికారి.. వీటన్నంటిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయం అవుతుందని ఇంకో అధికారి చెప్పారు.
ప్రభుత్వానికి ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అధికారం ఉన్నదని, దానికి అనుగుణంగా చట్ట సవరణ చేస్తే సరిపోతుందని, ఇందులో ప్రభుత్వం రాజకీయంగా తీసుకునే నిర్ణయమే అన్ని సందేహాలు, అనుమానాలకు సమాధానం అవుతుందని స్పష్టం చేస్తున్నారు. చట్టాలను సవరించే అధికారం, వెసులుబాటు ఏ ప్రభుత్వానికైనా ఉంటుందని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొన్నది. రాష్ట్రంలో బీసీల జనాభాను లెక్కించి వారికి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలు చేస్తామని అధికార కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో ప్రకటించింది. కానీ, మొత్తం రిజర్వేషన్లు 50% మించరాదని సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన హామీని ఏవిధంగా అమలు చేస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
స్థానిక సంస్థల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలన్న దానిపై రాష్ట్రంలో కసరత్తు మొదలైంది. ఈ రిజర్వేషన్‌న్లు కల్పించాలంటే బీసీల లెక్కలను శాస్త్రీయంగా ఇవ్వాలని సుప్రీంకోర్టు గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే తీర్పు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లన్నీ కలిపి 50 శాతం మించరాదని పేర్కొన్నది. ఎవరికి ఎంత శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారు? అందుకు ప్రాతిపదిక ఏమిటి? అనే వివరాలను సమర్పించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేయడంతో ఆ బాధ్యతలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ కమిషన్‌కు అప్పగించింది. దీంతో ఇప్పటికే పలు రాష్ర్టాల్లో పర్యటించిన తెలంగాణ బీసీ కమిషన్.. ఆయా రాష్ర్టాల్లోని స్థానిక సంస్థల్లో బీసీలకు ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించారు, ఆ ప్రక్రియను ఏ విధంగా పూర్తి చేశారనే దానిపై అధ్యయనం చేసింది.
అనంతరం రాష్ట్రంలో లెక్కలు తీయడంలో నిమగ్నమైన బీసీ కమిషన్.. 2006, 2014, 2019 ఎన్నికల్లో స్థానిక సంస్థలకు ఎవరెవరు, ఏ కులాలు, ఉప కులాల వారు ప్రాతినిధ్యం వహించారన్న వివరాలను తెలియజేయాలని పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది. దీంతో వార్డు సభ్యులు, ఉప సర్పంచ్‌లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, వైస్ ఎంపీపీలు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, జడ్పీ వైస్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్ల వివరాలతోపాటు వారి కులాలు, ఉప కులాలు, విద్యార్హతలు, వృత్తి, ఎన్నికల నాటికి వారి వయస్సు, వారు ప్రాతినిధ్యం వహించిన సంవత్సరం తదితర వివరాలను పంపించాలని పంచాయతీరాజ్ డైరెక్టర్ హన్మంతరావు అన్ని జిల్లాల పంచాయతీ అధికారులకు, జిల్లా పరిషత్ సీఈవోలకు స్పష్టం చేశారు.