చండ్రుగొండ, అక్టోబర్ 4 : స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన దళితులకు రిజర్వేషన్లు కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో మండల దళిత సంఘం శనివారం నిరసన తెలిపింది. ఈ సందర్భంగా సంఘ బాధ్యులు మాట్లాడుతూ చండ్రుగొండ పంచాయతీలో 700కు పైగా దళిత కుటుంబాలు ఉండగా.. ఏ ఒక్క వార్డు కూడా దళితులకు కేటాయించకపోవడం విచారకరమన్నారు.
ఏజెన్సీ ఏరియాలోని దళితులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. దళితుల రిజర్వేషన్ల అంశం గురించి రాజకీయ పార్టీలు ఎందుకు మౌనంగా ఉన్నాయో సమాధానం చెప్పాలని నిలదీశారు. దీనిపై ఎన్నికల సంఘం పునరాలోచన చేసి, దళితులకు రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలని కోరారు.