Private Universities | హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ ఉన్నత విద్యామండలి చేస్తున్న అధ్యయనం పూర్తికావొచ్చింది. ఉత్తరప్రదేశ్లో తప్ప మరెక్కడా ప్రైవేట్ వర్సిటీల్లో రిజర్వేషన్లు అమలుకావడం లేదని అధికారులు తేల్చారు. ఈ అంశంపై రూపొందించిన నివేదికను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఇటీవలే ఉన్నత విద్యపై నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి రిజర్వేషన్ల అంశంపై నివేదికను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అనురాగ్, మల్లారెడ్డి, ఎస్సార్ యూనివర్సిటీలు 2020లో ఏర్పాటయ్యాయి. అంతకు ముందే ఇక్ఫాయ్, చైతన్య, గీతం, మహీంద్రా, వోక్సేన్ వంటి వర్సిటీలున్నాయి. వీటి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం చేసింది. కనీసంగా 25 శాతం సీట్లను స్థానికులకు కేటాయించాలని నిబంధన పెట్టింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు మన తరహాలోనే వర్సిటీల ఏర్పాటుకు చట్టాలు చేశాయి. అయితే ఒక్క యూపీలో 2019లో చేసిన చట్టంలో ప్రైవేట్ వర్సిటీల్లో సీట్ల భర్తీలో రిజర్వేషన్లను అమలుచేయాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ క్యాటగిరీ రిజర్వేషన్ల సీట్ల భర్తీ సహా నియామకాలకు అమలు చేయవచ్చని స్పష్టం చేశారు. అయితే రిజర్వేషన్ కోటా ఎంతన్నది మాత్రం పేర్కొనలేదు. ఇదే విషయాన్ని రాష్ట్రప్రభుత్వం ముందుంచాలని ఉన్నత విద్యామండలి అధికారులు నిర్ణయానికి వచ్చారు.
దేశంలో 397 ప్రైవేట్ వర్సిటీలు
యూజీసీ అధికారిక సమాచారం ప్రకారం దేశంలో 397 ప్రైవేట్ వర్సిటీలున్నాయి. వీటిలో అత్యధికంగా బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ర్టాల్లో 245 యూనివర్సిటీలు ఉన్నాయి. మొత్తం ప్రైవేట్ యూనివర్సిటీల్లో 2014 తర్వాతే 210 ఏర్పాటయ్యాయి. వీటిల్లో రిజర్వేషన్ల అమలు అంశంపై నిర్ణయం రాష్ర్టాలకే వదిలేశారు. తాజాగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి అందజేసే నివేదిక ఆధారంగా రాష్ట్రంలోని ప్రైవేట్ వర్సిటీల్లో రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. ఇందుకు పాత చట్టాన్ని సవరించాల్సి ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీనిపై అనురాగ్ విద్యాసంస్థల సీఈవో నీలిమ స్పందిస్తూ రిజర్వేషన్ల అమలుతో తమకేం నష్టంలేదని, ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి వాటి ప్రకారం నడుచుకుంటామని తెలిపారు.