హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) రిజర్వేషన్ల కేటాయింపు రాష్ట్రవ్యాప్తంగా గందరగోళానికి దారితీస్తున్నది. ఒక్క బీసీ ఓటరు కూడా లేని తండాల్లో సర్పంచ్ స్థానం బీసీకి కేటాయించారు. అలాగే ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేని గ్రామంలో సర్పంచ్ పదవిని ఎస్టీకి రిజర్వ్ (Reservations) చేశారు. ఒక గ్రామంలో 100% ఓటర్లు బీసీలు ఉండగా, సర్పంచ్ స్థానాన్ని ఎస్టీకి కేటాయించారు. దీంతో ఆయా గ్రామాల్లో రిజర్వ్ క్యాటగిరీకి చెందిన అభ్యర్థిని ఎక్కడినుంచి తీసుకొస్తారనే ప్రశ్న తలెత్తుతున్నది. ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్ల కోసం 2011 జనాభా లెక్కలను, బీసీ రిజర్వేషన్ల కోసం 2024 కులగణన సర్వే లెక్కలను పరిగణనలోకి తీసుకున్నారు. సర్పంచ్ ఎన్నికల కోసం 2018 నాటి రిజర్వేషన్లను ప్రామాణికంగా తీసుకొని రొటేషన్ పద్ధతిని అనుసరించడం వల్ల కొన్నిచోట్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని పంచాయతీరాజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. గతంలో ఆయా గ్రామాల్లో ఉన్న ఎస్టీ, ఎస్సీ, బీసీ కుటుంబాలు వలస వెళ్లిపోవడం కూడా ఇందుకు కారణమై ఉంటుందని అంటున్నారు. పదేండ్ల క్రితం నాటి జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవడం, రొటేషన్ పద్ధతి అమలుచేయడం వల్ల ఇలాంటి గందరగోళ, ఆగమాగం పరిస్థితులు వచ్చాయ ని చెప్తున్నారు. ఒక్కో జిల్లాలో, ఒక్కో గ్రా మంలో ఒక్కో విచిత్ర పరిస్థితిని సృష్టించారని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు.
ఏజెన్సీలో గిరిజనేతర రిజర్వేషన్ ఆపేయాలి:టీఏజీఎస్
ఐదో షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనేతర రిజర్వేషన్ అమలుచేయొద్దని, ఆ ప్రాంతాల్లోని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు అన్నీ గిరిజనులకే రిజర్వేషన్ చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ఏజెన్సీ బయట ఉన్న ప్రాంతంలో మిగిలిన క్యాటగిరీలకు కేటాయించుకోవాలని కోరింది. ఐదో షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనేతరులకు అవకాశం ఇచ్చే రొటేషన్ పద్ధతిని ఆపాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబురావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసమ్ సచిన్ డిమాండ్ చేశారు.