హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): అణగారిన వర్గాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలే కాదని.. మహిళలు, పిల్లలు, ట్రాన్స్ జెండర్లు కూడా అని సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. ‘సామాజిక న్యాయం-రాజ్యాంగ హకులు’ అనే అంశంపై హైకోర్టు న్యాయవాదుల సంఘం బుధవారం నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆయన ప్రసంగించారు. అన్ని వర్గాలు సమ భాగస్వామ్య స్థాయికి వచ్చేవరకు అణగారిన వర్గాలకు రిజర్వేషన్ల కల్పన ఉండాలని అభిప్రాయపడ్డారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మాట్లాడుతూ యువ న్యాయవాదులకు ఉపయుక్తంగా ఉండేలా నిరంతరం పలు అంశాలపై సదస్సులు, చర్చాగోష్టులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వీ రఘునాథ్, న్యాయమూర్తి జస్టిస్ పీ నవీన్‌రావు, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.