హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పంచాయితీ దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో9కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వంగా గోపాల్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. 50 శాతానికి మించి 67 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం చట్ట విరుద్ధమని, గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పునకు ఇది వ్యతిరేకమని, జీవో9ను రద్దు చేయాలని కోరుతూ గోపాల్‌రెడ్డి తన పిటిషన్లో పేరొన్నారు. సుప్రీంకోర్టు ఇందిరా సహానీ ఇతరుల కేసుల్లో ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా తెలంగాణలో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని న్యాయస్థానానికి తెలిపారు. ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని పిటిషనర్ చేర్చారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
రిజర్వేషన్ల అంశంపైనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండింటితోపాటు ఈలోగా వచ్చే అన్ని పిటిషన్లను అదేరోజు విచారిస్తామని న్యాయస్థానం ప్రకటించింది. రిజర్వేషన్ల అమలుకు తెచ్చిన జీవో9ను రద్దు చేయాలని కోరుతూ ఇప్పటికే హైకోర్టులో మాధవరెడ్డి అనే వ్యక్తి పిటిషన్‌ను దాఖలు చేయగా, ఈ అంశంపై తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. దీంతో రిజర్వేషన్ల అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. హైకోర్టులో కేసు ఉండగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. సోమవారం సుప్రీంకోర్టు ఏమి తీర్పు ఇస్తుంది? 8న హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 రిజర్వేషన్లు ఉంటాయా? మారుతాయా? అసలు ఎన్నికలు జరుగుతాయా? వాయిదా పడుతాయా? అనే ఉత్కంఠ, ఆందోళన తెలంగాణ ప్రజల్లో నెలకొన్నది.