హైదరాబాద్ సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ): కొవిడ్ మహమ్మారిని నిర్మూలించే దిశగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) కీలక అడుగు వేసింది. వ్యాక్సిన్ తయారీలో అంతర్జాతీయ స్థాయి సేవలను అందించిన ఈ సంస్థ కొవిడ్ ఔషధ తయారీ కోసం ఇజ్రాయెల్‌కు చెందిన 101 థెరపాటిక్స్ లిమిటెడ్‌తో కలిసి మూడేండ్లపాటు పరిశోధనలు చేయనున్నది. దీని కోసం ఐఐసీటీ డెవలప్ చేసిన క్లినికల్ ట్రయల్ ప్రొటోకాల్, ల్యాబోరేటరీలను వినియోగించుకోనున్నారు. ఇందుకు సంబంధించి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్), ఇజ్రాయెల్‌కు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (డీడీఆర్అండ్డీ) మధ్య ఇటీవల ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్, సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కళైసెల్వి సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి డీడీఆర్అండ్డీ ప్రతినిధి ఓషర్ షపీరా, 101 థెరాపాటిక్స్ సంస్థకు చెందిన ఆల్క్ గోల్డ్బర్గ్, ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, చీఫ్ సైంటిస్టులు డాక్టర్ సిస్ట్లా రామకృష్ణ, డాక్టర్ డీ శైలజ తదితరులు హాజరయ్యారు.