Gurukula Schools | హైదరాబాద్, జూలై12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గురుకులాల నిర్వహణ బాధ్యతను స్థానిక స్వయం సహాయక సంఘాలకు అప్పగించే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నది. తొలుత తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఐఈఎస్) పరిధిలోని గురుకులాల నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నది. సొసైటీల పరిధిలో పరిశుభ్రత చర్యల కోసం ఆర్సీవోల పరిధిలో ప్రత్యేకంగా శానిటేషన్ రెస్య్యూ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ విద్యార్థి హెల్త్ ప్రొఫైల్పైనా దృష్టి సారించనున్నారు. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణి ఆయా వివరాలను వెల్లడించారు.
గురుకుల విద్యార్థులకు నాణ్యమైన పౌష్ఠికాహారాన్ని అందించేందుకు, ఆ బాధ్యతలను స్థానిక సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు అప్పగించాలని యోచిస్తున్నట్టు చెప్పారు. ఆసక్తి ఉన్న మహిళా సంఘాలు ముందుకొస్తే గురుకులాల నిర్వహణ బాధ్యతను టెండర్లు లేకుండానే నేరుగా అప్పగిస్తామని తెలిపారు. గురుకుల విద్యార్థులకు అందించే కాస్మోటిక్స్ నిధులు, డైట్ బిల్లులను కూడా గ్రీన్ చానల్ పద్ధతిలో చెల్లిస్తామని తెలిపారు. శానిటేషన్ బృందంలో ప్లంబర్, ఎలక్ట్రీషియన్, పెస్ట్ కంట్రోల్ తదితర విభాగాలకు చెందిన నిపుణులు ఉంటారని తెలిపారు. ఆర్సీవో పరిధిలోని గురుకులాల్లో శానిటేషన్ పనులన్నీ ఆ బృందాలే పర్యవేక్షిస్తాయని వెల్లడించారు.
గురుకుల విద్యార్థులు తమ సమస్యలను వివరించేందుకు సొసైటీ ప్రధాన కార్యాలయంతో అనుసంధానిస్తూ త్వరలోనే పైలట్ ప్రాజెక్టుగా 10 గురుకులాల్లో ఒక టెలిఫోన్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఆ తరువాత దానిని అన్ని గురుకులాలకు విస్తరిస్తామని తెలిపారు. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి 5వ తరగతి ప్రవేశాల పక్రియను ఈ నెల 20లోగా పూర్తి చేయనున్నట్టు సెక్రటరీ వర్షిణి స్పష్టం చేశారు. 15 నుంచి 18 వరకు గురుకుల ప్రమోషన్ల ప్రక్రియ నిర్వహిస్తామని, ఆ తర్వాత 19-20వ తేదీల్లో కొత్తగా అపాయింట్మెంట్ అందుకున్న అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇస్తామని వెల్లడించారు. సమావేశంలో సొసైటీ అడిషనల్ సెక్రటరీ హన్మంత్‌నాయక్, జాయింట్ సెక్రటరీ అనంతలక్ష్మీ పాల్గొన్నారు.
నార్నూర్ గురుకులంలో 20మంది విద్యార్థులకు అస్వస్థత
నార్నూర్, జూలై 12: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ గురుకుల, ఆశ్రమ, ఆదర్శ పాఠశాలకు చెందిన 22 మంది విద్యార్థులు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోస సమస్యతో ఇబ్బంది పడుతూ దవాఖాన పాలయ్యారు. గమనించిన ఉపాధ్యాయులు, సిబ్బంది వారిని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యాధికారులు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఆయా సంఘాల, పార్టీల నాయకులు దవాఖానకు ఎదుట నిరసన తెలిపారు. స్టాఫ్ నర్సు సరికా విద్యార్థులకు వైద్య సేవలు అందించారు. అందులో నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండటంతో ఉట్నూర్ దవాఖానకు తరలించారు.