హైదరాబాద్, మార్చి 10 ( నమస్తే తెలంగాణ ) : ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనకు సంబంధించి చేపట్టిన సహాయ చర్యలను ముమ్మరం చేయాలని రెస్క్యూ బృందాలకు డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్ సూచించారు. సోమవారం ఆయన టన్నెల్ కార్యాలయంలో నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్‌తో కలిసి రెస్క్యూ బృందాలతో ప్రత్యేకంగా సమీక్షించారు. ఇప్పటివరకు కొనసాగిన సహాయక చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. టన్నెల్ ప్రమాదంలో కార్మికుడు, పంజాబ్ రాష్ర్టానికి చెందిన గురుప్రీత్‌సింగ్ మృతిపై సంతాపం వ్యక్తంచేశారు. రెస్క్యూ బృందాలు సమన్వయంతో పనిచేస్తూ సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని సూచించారు. రెస్క్యూ బృందాలకు, అధికారులకు, పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, అవసరమైన అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇతర రెస్క్యూ విభాగాల అధికారులు పాల్గొన్నారు.