మహబూబ్‌నగర్, మార్చి 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎస్ఎల్బీసీ సొరంగంలో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌ను అధికారులపై నెట్టేసి, మంత్రులు తప్పుకున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నది. 8 రోజుల క్రితం దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలిన ఘటనలో 8 మంది కార్మికులు గల్లంతయ్యారు. ఘటన జరిగినప్పుడు అంతా తామే అన్నట్టు వ్యవహరించిన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు.. చివరి నిమిషంలో అధికారులపై భారం మోపారు.
ఆదివారం నుంచి తాము రాబోమని అధికారులకు తేల్చి చెప్పినట్టు ప్రచారం జరుగుతున్నది. రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకున్న తరుణంలో మృతుల కుటుంబాలకు ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందోనని వారు తప్పుకున్నట్టు భావిస్తున్నారు. నాగర్‌కర్నూల్ కలెక్టర్, ఎస్పీ, ఇతరులకు బాధ్యతలు అప్పజెప్పి మంత్రులు తప్పుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది.