అచ్చంపేట : శ్రీశైలం ఎడమ గట్టు సొరంగంలో ( SLBC ) గల్లంతైన కార్మికుల ఆచూకీ కోసం మూడు షిఫ్ట్‌లుగా రెస్య్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి (Special Officer Shiva Shanker) వెల్లడించారు. ఘటన జరిగి 54 రోజులుగా గడుస్తున్నా గల్లంతైన వారి జాడ తెలియరాకపోవడంతో కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎస్ఎల్బీసీ చేపట్టిన సహాయక చర్యలపై ప్రత్యేక అధికారి గురువారం కూడా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల కొనసాగుతున్న సహాయక చర్యలను వివరించారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ తెలుసుకునేందుకు డీ-1, డీ- 2 ప్రాంతాలలో అన్వేషణ జరిగిందని, ప్రస్తుతం డీ-2 ప్రాంతంలో పూర్తిస్థాయిలో మట్టి తవ్వకాలు, టీబీఎం కత్తిరింపు పనులు కొనసాగుతున్నాయని వివరించారు.
డీ-2 ప్రాంతంలో 5 ఎస్కవేటర్ల సహాయంతో పెద్ద బండ రాళ్లను తొలగిస్తూ , అత్యధికంగా ఉన్నటువంటి మట్టిని కన్వేయర్ బెల్ట్ గుండా టన్నెల్ బయటకీ పంపుతున్నామని వెల్లడించారు. ఊట నీటిని నిర్విరామంగా బయటకు పంపించేస్తున్నట్లు తెలిపారు.
టన్నెల్ లోపల ప్రమాదం సంభవించిన ప్రాంతాన్ని నిషిద్ధ ప్రదేశంగా గుర్తించి కంచె ఏర్పాటు చేసినట్లు, టన్నెల్ నిపుణులు ప్రమాద ప్రదేశాన్ని నిరంతరం పరిశీలనలో ఉంచినట్లు, సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బందికి తగు జాగ్రత్తలు సూచించినట్లు పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో కేంద్ర రాష్ట్ర సహాయక బంధాల ఉన్నతాధికారులు, జేపీ కంపెనీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.