అచ్చంపేట : ఎస్ఎల్బీసీ టన్నెల్ (SLBC Tunnel ) లోని డీ1, డీ2 ప్రదేశాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. టన్నెల్లో చిక్కుకున్న మిగిలిన ఏడుగురిని గుర్తించడానికి రెస్క్యూ ఆపరేషన్ (Rescue operation) 24వ రోజుకు చేరుకున్నది. డీ1 ప్రదేశంలో నీటి ఊట భారీగా రావడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందిగా మారింది. ఏడుగురి మృతదేహాలను గుర్తించడానికి సోమవారం ఉదయం రెస్క్యూ బృందాలతో పాటు కేరళకు చెందిన క్యాడర్ డాగ్స్( Cader Dogs) లోపలికి వెళ్లాయి.
సోమవారం ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆఫీస్ వద్ద నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్( Collector Santhosh) , జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ ( SP Vaibhav ) , సహాయక బృందాల ఉన్నతాధికారులతో సహాయక చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు సహాయక బృందాలు నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్నవారు ఉన్న ప్రదేశంగా డీ1, డీ2 ప్రదేశాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో సహాయక చర్యలను మరింత వేగవంతం చేశామన్నారు.
సహాయక చర్యల్లో అడ్డంకి గా మారుతున్న టన్నెల్ బోరింగ్ మెషిన్ భాగాలను తొలగించే పనులు కొనసాగిస్తూ, ఎస్కావేటర్, రెట్టింపు సహాయక బృందాలతో మట్టిని తొలగించే పనులు వేగవంతం చేసినట్లు వివరించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ, ర్యాట్ హోల్ మైనర్స్ బృందాలు, డీ 1, డీ2 ప్రదేశాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు తెలియజేశారు .
ప్రమాద ప్రదేశంలో నీటిని తొలగించేందుకు డి-వాటరింగ్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్మీ, సింగరేణి మైన్స్ రెస్క్యూ టీమ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ర్యాట్ హోల్ మైనర్స్, క్యాడర్ డాగ్స్, హైడ్రా, దక్షిణ మధ్య రైల్వే, జీఎస్ఐ, బృందాల అధికారులు పాల్గొన్నారు.