అచ్చంపేట : దోమలపెంట ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్లో సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ ( Rescue operation ) ఆదివారం 31వ రోజుకు చేరుకున్నది. టన్నెల్ ఆఫీస్ వద్ద జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ( Collector Santosh) ఉన్నతాధికారులతో టన్నెల్ లోపల చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
కలెక్టర్ మాట్లాడుతూ డీ-1, డీ-2 ప్రదేశాల్లో మట్టి తవ్వకాలు, డి-వాటరింగ్ను బయటకు పంపే ప్రక్రియ వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రమాద ప్రదేశాన్ని మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో సహాయక చర్యలు పూర్తిస్థాయిలో కొనసాగుతున్నాయని వివరించారు. సంఘటన జరిగిన నాటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఎన్డీఆర్ఎఫ్(NDRF), ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ, దక్షిణ మధ్య రైల్వే బృందాలు ప్రతికూల పరిస్థితుల్లో 24 గంటల పాటు శ్రమిస్తున్నాయని వెల్లడించారు.
సహాయక చర్యల్లో పురోగతి
టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం) కత్తిరించిన భాగాలను తొలగిస్తూ, వాటర్ జెట్ ద్వారా బురదను తొలగిస్తున్నారు. ఎస్కవేటర్ల ద్వారా మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. ప్రమాద ప్రదేశం వరకు విద్యుత్, వెంటిలేషన్ పునరుద్ధరణ పూర్తయిందని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. సహాయక బృందాలకు అవసరమైన వసతులు, ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో ఎన్డీఆర్ఎఫ్ అధికారులు డాక్టర్ హరీష్, ఎస్డీఆర్ఎఫ్, దక్షిణ మధ్య రైల్వే, అన్వి రోబోటిక్స్, జేపీ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.