మహబూబ్‌నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్ (SLBC Tunnel Mishap) వద్ద ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం వేగంగా స్పందించకపోవడం, రెస్క్యూ ఆపరేషన్‌ను ఆలస్యంగా చేపట్టడంతో టన్నెల్లో చిక్కుకున్న వారు ఇంకా బతికే ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మట్టి దిబ్బదలు, బురదలో చిక్కున్న వారు ఇన్ని రోజులు ఊపిరితో ఉండగలరా అనే సందేహం నెలకొన్నది. ఈనేపథ్యంలో శుక్రవారం నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ‘గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్’ (జీపీఆర్) పరికరంతో కార్మికులు చిక్కుకున్న ప్రదేశాన్ని గుర్తించినట్టు తెలుస్తున్నది. రెస్క్యూ బృందాలు శుక్రవారం తెల్లవారుజాము నుంచి జీపీఆర్ ద్వారా జీరో పాయింట్ వరకు చేరుకొని ఆ ప్రదేశమంతా స్కానింగ్ చేశారు.
ఈ రిపోర్టును పరీక్షించిన అనంతరం కార్మికులు ఐదు స్పాట్లలో చిక్కుకొని ఉంటారనే ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తున్నది. మరోసారి క్రాస్‌చెక్ చేసుకున్న బృందం ఇది నిజమేనన్న నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ఆ ఐదు ప్రదేశాల్లో ఎలాంటి కదలిక లేనట్లు గుర్తించారు. దీంతో వారు ప్రాణాలతోనే ఉన్నారా అనే విషయమై సందేహం నెలకొన్నది. ఈ క్రమంలోనే నాగర్‌కర్నూల్ దవాఖాన వద్దకు 8 అంబులెన్సులు చేరుకోవడంతో అనుమానాలు రెట్టింపయ్యాయి. టన్నెల్లో చిక్కుకున్నవారు మరణించినట్లు ఏ క్షణమైన ప్రకటించే అవకాశం ఉన్నదని, వారిని నాగర్‌కర్నూల్ జనరల్ హాస్పిటల్‌కు తరలించనున్నారని తెలుస్తున్నది. అక్కడి నుంచి మృతదేహాలను స్వస్థలాలకు పంపించనున్నారని సమాచారం.
కాగా, టన్నెల్ వద్ద జరుగుతున్న సహాయక చర్యలను నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ పర్యవేక్షిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న అధికారులతో సమావేశమేయ్యారు. సొరంగం వద్దకు ఉస్మానియా దవాఖానకు చెందిన వైద్యులు చేరుకున్నారు. అదేవిధంగా పార్థివదేహాల అంబులెన్సులు చేరుకున్నాయి.