Advocate General | హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : అధికారంలోకి రాగానే 46 జీవోను రద్దు చేసి, కానిస్టేబుల్ పరీక్షల్లో మెరిట్ సాధించిన వారికి న్యాయం చేస్తామని పీసీసీ అధ్యక్షుడి హోదాలో చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. తక్షణం అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టుకు పంపి, తమ న్యాయమైన సమస్యను పరిష్కరించాలని కానిస్టేబుల్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. మెరిట్ వచ్చిన తమకు లేనిపోని ఆశలు కల్పించి.. ఉద్యమించేలా చేసి, తీరా కేసు హైకోర్టుకి రావడంతో ప్రభుత్వ పెద్దలు తప్పించుకొని తిరగడం ఏమాత్రం భావ్యంగా లేదని వాపోతున్నారు. ఎమ్మెల్యేల అనర్హత కేసులో హైకోర్టుకు హాజరవుతున్న ఏజీ.. వేలాది మంది అభ్యర్థుల భవిత్యాన్ని తేల్చే జీవో 46పై జరిగే వాదనలకు ఎందుకు హాజరు కావడంలేదని ప్రశ్నిస్తున్నారు.
46 జీవో రద్దుపై హైకోర్టులో ఈనెల 19న తుది వాదనలు జరగనున్నాయని, దానికైనా అడ్వకేట్ జనరల్ వచ్చి ప్రభుత్వం తరఫున వాదన ఏంటో స్పష్టంగా చెప్పాలని కానిస్టేబుల్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ‘నిరుద్యోగులు కొట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని.. కానీ, ఆ నిరుద్యోగులకు మీ ప్రభుత్వంలో న్యాయం జరగడం లేదు సార్’ అంటూ కానిస్టేబుల్ ఉద్యోగార్థులు తీవ్రఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కోర్టులోనే తేల్చుకుందామని, ఇప్పుడు కోర్టుకే న్యాయవాదులను పంపకపోతే మమ్మల్ని మోసం చేసినట్టు కాదా? అని ఆవేదన చెందుతున్నారు.
46 జీవో రద్దు గురించి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ వేసిందని, అందులోనూ బాధిత జిల్లాలకు ప్రాతినిధ్యం వహించే ఒక్క ప్రజాప్రతినిధిలేడని కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కేవలం రెండు నెలల్లో రిపోర్టు ప్రభుత్వానికి ఇస్తామని చెప్పిన కమిటీ.. ఒక్కసారైనా తమ సమస్య కోసం కూర్చుందా? ప్రభుత్వంతో చర్చించిందా? రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చిందా? అని ప్రశ్నిస్తున్నారు.సబ్ కమిటీ త్వరగా రిపోర్టు ఇస్తే.. దానిని కోర్టులో సమర్పిస్తే.. తదుపరి చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ విషయంలో ప్రస్తుత ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం లేకపోవడంతోనే అడ్వకేట్ జనరల్ వరసగా వాయిదాలు కోరుతున్నారని అంటున్నారు. కోర్టుఫీజులు కట్టుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.