అమీన్పూర్, సెప్టెంబర్ 28 : సంగారెడ్డి జి ల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఐలాపూర్ తండాలో శనివారం రాత్రి ఓ విలేకరిని చితకబాదారు. స్థానికుల కథనం ప్రకారం.. అమీన్‌పూర్‌కు చెందిన జనం సాక్షి పత్రిక విలేకరి సంతోష్ ఐలాపూర్‌లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని తెలుసుకొని అక్కడి వెళ్లాడు. అక్కడి నాయకులు ముఖీం, అజీంతోపాటు స్థానికులు సదరు రిపోర్టర్‌ను స్తంభానికి కట్టేసి చితకబాదారు. నిత్యం బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో సహనం కోల్పోయి ఈ చర్యకు పాల్పడినట్టు స్థానికులు తెలిపారు. విలువైన ప్లాట్లతోపాటు లక్షలు ఇచ్చినట్టు వారు చెప్పారు. అయినప్పటికీ హైడ్రాఅధికారులతో మాట్లాడి ఇక్కడ నిర్మిస్తున్న ఇండ్లను కూల్చివేయిస్తానని బెదిరించడంతోపాటు తాగిన మైకంలో మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో దాడి చేశామని తెలిపారు. స్థానిక నాయకుడు ముఖీం అమీన్పూర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు.