హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం తమ్మిడిహెట్టి ప్రాజెక్టును నిలిపేసి, కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం పద్మనాభరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ప్రభుత్వం ప్రాణహిత నదిపై తమ్మిడిహెట్టి ప్రాజెక్టును ప్రారంభించాలని యోచిస్తున్నట్టు తెలిసిందని లేఖలో పేర్కొన్నారు.
2006లో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించగా.. 2014 నాటికి దాదాపు రూ.8 వేల కోట్లు ఖర్చు అయినట్టు వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించగా, కొత్తగా తమ్మిడిహెట్టి ప్రాజెక్టును చేపట్టాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారీ సాగునీటి ప్రాజెక్టులకు కనీసం రెండేండ్లపాటు విరామం ఇవ్వడం మంచిదని, 90శాతం పూర్తయిన ప్రాజెక్టును కొనసాగించి, మిగతా వాటిని తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు.