‘ఉన్న ఎకరం పొలం మంచిగ చేసుకుందామని అప్పుజేసిండు. గొర్రెలు కొన్నడు.. ఆవులు కొన్నడు.. ఏదీ సాతియ్యలే. చేసిన అప్పులు పెరిగి నెత్తిమీద కుంపటైనయి. పైసలు ఎక్కడికెళ్లి తెచ్చేదని నిత్యం రంది పడ్డడు. అప్పోసప్పో చేసి బిడ్డను ఓ అయ్య చేతిలో పెట్టాల్నని మస్తు బాధపడ్డడు. బిడ్డ రుణం తీర్చుకోక ముందే ఎల్లిపోయిండు. మాకు దిక్కు లేకుంట చేసిండు’ ఇదీ కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బొంతుపల్లి గ్రామంలోఆత్మహత్య చేసుకున్న ముష్క సదయ్య (45) భార్య రేణుక నిర్వేదం. ఆమెను కదిలిస్తే.. ‘ఆయనపైన మాటలేకుంట ఉన్న ఇల్లమ్మి అప్పుల్ని కడుతా’ అని కన్నీటిపర్యంతమైంది. కాంగ్రెస్ అధికారంలో రాష్ట్రంలో తనువు తీసుకున్న రైతు కుటుంబాలకు ఆసరా లేదనడానికి ఇదీ ఓ నిదర్శనం.
Karimnagar | కరీంనగర్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బొంతుపల్లి గ్రామానికి చెందిన ముష్క సదయ్య (45), రేణుక దంపతులు. వీరికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. డాక్టర్ కావాలన్న బిడ్డ కోర్కెను తీర్చాలని, కొడుకును ప్రయోజకుడిని చేయాలన్న ఆశతో ఆ దంపతులు ఉన్నారు. ఇంతలోనే ఆ ఇంటిపై అప్పుల పిడుగు పడింది. వ్యవసాయానికి, కుటుంబ పోషణకు చేసిన అప్పులు క్రమంగా పెరిగి మోయలేని భారంగా మారాయి. గొర్రెలు, ఆవుల పోషణ కూడా ఆ ఇంటి అప్పులకు దారిచూపలేదు. తెలంగాణ వచ్చినంక పదేండ్లపాటు పెట్టుబడులకు, ఇతర పనులకు సదయ్య, రేణుక కుటుంబం ఎలాంటి ఇబ్బందులు పడలేదు. కానీ ఏడాది క్రితం వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి ఆసరా ఇవ్వలేకపోయింది. రైతుభరోసా అందని ద్రాక్షే అయింది. అప్పులబాధతో మనస్తాపం చెందిన సదయ్య విధిలేక 2024 ఫిబ్రవరి 12న తమ వ్యవసాయ బావి వద్దే చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో సదయ్య మరణం తర్వాత ఆ ఇల్లు పూర్తిగా ఆగమైంది. పట్టించుకునే పాలకులు కానరాలేదు. అప్పులు తీర్చేదారిలేదని, ఎదిగిన బిడ్డ పెండ్లి ఎలా చేయాలనే మనోవేదనతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు సదయ్య భార్య రేణుక ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ఏడాది కావస్తున్నా ఈ ప్రభుత్వంలో తనకు వితంతు పింఛన్ కూడా అందక కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నట్టు దుఃఖభారంతో చెప్పింది.
ఆగిన సదయ్య బిడ్డల చదువు
సదయ్య ఆత్మహత్యతో ఆ కుటుంబం దిక్కులేనిదైంది. ఇంటర్ వరకు చదివిన సదయ్య కొడుకు రాజు అప్పటికే ఇల్లు గడవక చదువు మానేశాడు. ఇంటర్లో బైపీసీలో 900కు పైగా మార్కులు సాధించిన ఆయన కూతురు అనూష చదువుపైనా భారం పడింది. చదువులో విశేష ప్రతిభ చూపిన బిడ్డ అనూష కోరిక మేరకు డాక్టర్ చేయాలన్న సదయ్య కల కలగానే మిగిలింది.
కేసీఆర్ ‘రైతు బీమా’యే ఆసరా
సదయ్య మరణం తర్వాత దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆయన కుటుంబాన్ని చివరికి రైతు బీమా పథకమే ఆసరగా నిలిచింది. ఆయన మరణించిన నెల తర్వాత ఈ పథకం కింద వచ్చిన రూ.5 లక్షలు ఈ కుటుంబానికి కొండంత అండగా నిలిచాయి. అప్పటివరకు ఉన్న రూ.10 లక్షల అప్పుల్లో ఒక్కొక్కరికీ కొంత కొంత చెల్లించిన ఆ ఇల్లాలు కుటుంబ పరువును నిలిపింది. ఈ అప్పు చెల్లింపులు సదయ్య కూతురు అనూష పెండ్లికి కలసి వచ్చాయి.
అప్పు తీర్చేమార్గం లేక..
మిగిలిన అప్పు, బిడ్డ పెండ్లి అప్పులను తీర్చే మార్గం కూడా సదయ్య కుటుంబానికి లేకుండాపోయింది. ఉన్న ఎకరంలో పసలుకు రూ.50 వేలు కూడా రావడం లేదని రేణుక, కొడుకు రాజు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సదయ్య ఉండగానే సగం నిర్మించిన ఇంట్లోనే ఆ కుటుంబం కాలం గడుపుతున్నది.
పట్టించుకోని పాలకులు
సదయ్య చనిపోయినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ఒక్కరూ కనీసం పరామర్శించలేదు. అధికార పార్టీ నాయకులు ఎవరూ ఆ ఇంటి ముఖం చూడనేలేదు. సదయ్య చనిపోయాక ఆర్థికంగా చితికి పోతున్న ఆ కుటుంబానికి ప్రభుత్వం సాయం అందని ద్రాక్షగానే మిగిలింది. అప్పులుతీరే దారికలేక, జీవనం గడవని ఆ కుటుంబాన్ని ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకున్న దాఖలాలే లేవని స్థానికులు కూడా చెప్పారు. సదయ్య ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ఎంత అప్పు అయింది.. అని అడిగేందుకు ఏ ఒక్క అధికారి కూడా ఆ ఇంటి గడప తొక్కలేదని తెలిపారు. ఇంతటి గడ్డు పరిస్థితుల్లో ఉన్న ఈ కుటుంబానికి రైతు భరోసా అందలేదు. అలాగే సదయ్య భార్య రేణుకకు ఇంతవరకూ వితంతు పింఛన్ రావడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రేణుకు కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు స్థానికులు కోరుతున్నారు.
ఒక్కలు కూడా పరామర్శకు రాలే..
మా నాన్న చనిపోయి దుఖంలో ఉన్న మా కుటుంబాన్ని పరామర్శించేందుకు ఒక్క నాయకుడు రాలే. ఒక్క అధికారీ రాలే. మా నాన్న చానా ఇజ్జత్ మనిషి. వ్యవసాయం కోసం చేసిన కొంత అప్పు వడ్డీ పెరిగి మోతకోలు అయ్యింది. అది తీర్చలేక, మా చెల్లి పెండ్లి చేయలేక పోతున్నానని మనోవేదనకుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నడు. ఇల్లు గడవడానికి నా చదువు సుతం ఆపేసి కూలి పనులు చేసినా అప్పులు తీరలే. ఒక రైతు అప్పుల బాధతో చనిపోతే ఎందుకు చనిపోవాల్సి వచ్చిందని ప్రభుత్వం విచారణ చేయొద్దా? మా కుటుంబం ఇప్పుడు ఆగమైంది. మా చెల్లె పెండ్లికి చేసిన అప్పు సుతం తీరే పరిస్థితి కనిపిస్తలేదు. ఉన్న ఇంటిని అమ్మి అప్పు కట్టాలని చూస్తున్నం. ఏ రైతు కుటుంబానికి మాలాంటి పరిస్థితి రావద్దని కోరుకుంటున్న.
– ముష్క రాజు, సదయ్య కొడుకు