హైదరాబాద్, అక్టోబర్22(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ అధికారుల విధుల కోసం అద్దె ప్రాతిపదికన తిప్పే అన్ని వాహనాలు రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయాయి. హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాల్లో సుమారు 20 నెలల నుంచి బిల్లులు పెండింగ్ ఉండటంతో తమకు రావాల్సిన డబ్బుల కోసం ప్రభుత్వ అద్దె వాహనదారులు గళమెత్తారు. తమకు రావాల్సిన బకాయిల కోసం బుధవారం నాంపల్లిలోని కమర్షియల్ ట్యాక్స్ బిల్డింగ్‌లో సుమారు 500మంది డ్రైవర్లు శాంతియుతంగా నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తిరిగే ప్రభుత్వ అద్దెవాహనాలకు రావాల్సిన రూ.240 కోట్ల బకాయిలు తక్షణం విడుదల చేయాలని నినాదాలు చేశారు. తమ శాంతియుత నిరసనలపై ప్రభుత్వం స్పందించని పక్షంలో చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై డ్రైవర్ యూనియన్ నేతలు చర్చలు జరిపారు.
భార్య పుస్తెలు తాకట్టు పెడుతున్నాం..
20 నెలలుగా తమకు రావాల్సిన డబ్బులపై ఇటు అధికారులు, అటు ప్రభుత్వం స్పందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని డ్రైవర్లు ఆవేదన వ్యక్తంచేశాడు. ఒక్కోసారి డీజిల్‌కు డబ్బుల్లేక, పిల్లల చదువులు, ఇంటి ఖర్చుల కోసం అప్పు చేయడమే గాక భార్య పుస్తెలు తాకట్టు పెడుతున్నామని డ్రైవర్ సైదిరెడ్డి చెప్పాడు. బకాయిలు చెల్లించకపోతే ఆటో డ్రైవర్ల మాదిరిగానే తమకు కూడా ఆత్మహత్యలే శరణ్యమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.