బంగారు వర్ణంలో దర్శనమిచ్చే క్యూలైన్లు!
మాడవీధుల్లో వేంచేపు, బ్రహ్మోత్సవ మండపాలు!!
రాజప్రాసాదాన్ని తలపించే ముఖ మండపం!
స్వర్ణకాంతులతో మెరిసే గర్భగుడి మహాద్వారం!!
ప్రహ్లాద చరిత్రను కండ్లకు కట్టేలా చిత్రాలు!
ఆళ్వారుల విగ్రహాలు.. చుట్టూ ఉపాలయాలు!!
అంతా శ్రీహరి రూపమే.. శిల్పాలన్నీ నరహరి లీలలే
యాదాద్రి అంతటా వినిపించే దైవ నామస్మరణ
ఒంటినిండా భక్తిని ప్రసరించే ఓం నమో నారసింహాయ
యాదాద్రి భువనగిరి, మార్చి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నవ వైకుంఠాన్ని చూడాలన్న ఏడున్నరేండ్ల కోరిక మరికొన్ని గంటల్లో నెరవేరబోతున్నది. యాదాద్రిపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి సోమవారం నుంచి భక్తులకు పునర్దర్శనం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్టపై అడుగుపెట్టింది మొదలు, స్వామివారిని దర్శించుకొనేవరకు కండ్లముందు కనిపించే అణువణువూ ఆధ్యాత్మికతను, ఆహ్లాదాన్ని పంచుతుంది. పట్టణంలోకి అడుగుపెట్టగానే ఓం నమో నారసింహాయ మంత్రం ఒంట్లో భక్తిభావాన్ని పెంపొదిస్తుంది. అలా ఆలయంవైపు అడుగులు వేయగానే కొండపైనున్న సప్త గోపురాలు స్వర్గలోక వైకుంఠాన్ని చూసినంత ఆనందాన్ని కలిగిస్తాయి. ఇంకాస్త ముందుకు వెళ్లగానే వైకుంఠ ద్వారం భక్తులకు స్వాగతం పలుకుతుంది. ఇక్కడి నుంచి మెట్ల మార్గం ద్వారా ప్రధానాలయానికి చేరుకోవచ్చు. వాహనాల్లో వచ్చేవారు క్యూకాంప్లెక్స్ల ద్వారా దర్శనానికి రావాలి. ఆలయ పరిసరాల్లోకి చేరుకోగానే ఆలయంలోకి వెళ్లే క్యూలైన్ బంగారు వర్ణంలో మెరుస్తుంది.
ప్రసాదం కౌంటర్ల వద్ద నుంచి మొదలయ్యే క్యూలైన్ల నుంచే కళాత్మకత ఉట్టిపడుతుంది. ఆలయ నిర్మాణానికి అనుగుణంగా ప్రధానాలయం మాడ వీధుల్లో మందిరం రూపంలో ఏర్పాటైన దర్శన వరుసలు నృసింహుడి ప్రతిమలతో ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయి. అష్టభుజి మండప ప్రాకారాల వరకు ఈ క్యూలైన్ ఉంటుంది. బాహ్య ప్రాకార మండపాలను దాటుకుంటూ ప్రధానాలయం మొదటి ప్రాకారంలోకి భక్తులు అడుగు పెట్టాల్సి ఉంటుంది. ఆలయం ముఖ మండపంలోనూ ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. బంగారు వర్ణంతో తీర్చిదిద్దిన ఈ క్యూలైన్లు ముఖమండపానికి సరికొత్త శోభను తెస్తున్నాయి.
గుహలో స్వయంభువుగా వెలసిన మూలవరులను దర్శించుకొని ఉత్తర దిశలో ఉన్న మెట్ల మీదుగా పడమటి రాజగోపురం ద్వారా బయటకు వెళ్లేవరకూ గోడలపై ఇరువైపులా..ఆధ్యాత్మిక రూపాలే కనిపిస్తాయి. ఏనుగుల వరుసలు, శంఖు, చక్ర, నామాలు, గరుత్మంతుడు, ఆంజనేయస్వామి, సుదర్శనమూర్తి, యోగా నరసింహుడి రూపాలు కనువిందు చేస్తాయి. ముఖ మండపాన్ని పూర్తిగా ఎయిర్ కండిషన్ చేశారు. సహజ వెలుతురు ఉండేలా 12 సోలార్ రూఫ్ ప్యానల్స్ ఏర్పాటు చేశారు. గర్భాలయం వెనుక భాగంలో ఉన్న మార్గాన్ని ముక్కోటి ఏకాదశి పర్వదినాల్లో ఉత్తరద్వార దర్శనంగా ఉపయోగిస్తారు.
పడమటి రాజగోపురం ద్వారా మొదటి ప్రాకార బాహ్య ప్రాంతంలో ఉన్న మాడవీధుల్లోకి అడుగుపెడితే అద్దాల మండపం, 500 మంది కూర్చొని నిత్యకల్యాణం వీక్షించేలా మండపం, రామానుజ కూటమి కన్పిస్తాయి. అష్టభుజి మండప ప్రాకారాలు, సాలహారాల్లో ప్రతిష్ఠించిన కేశవమూర్తులు, నవ నారసింహులు, ఆళ్వారులు, అష్ట దిక్పాలకులు, అష్టలక్ష్మి, దశావతారాలు, వైష్ణవ విగ్రహాలు కండ్లను కట్టిపడేస్తాయి. 58 యాళీ పిల్లర్లు, బాలపాద పిల్లర్లు శిల్పుల నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఆలయం వెలుపలకు వస్తే బయటి మాడవీధుల్లో వేంచేపు మండపం, చుట్టూ తిరిగి వస్తే రథశాల, వీఐపీల కోసం ఏర్పాటు చేసిన లిఫ్ట్, పదివేల మంది వీక్షించేలా తీర్చిదిద్దిన బ్రహ్మోత్సవ మండ ప ప్రాంగణాన్ని చూడొచ్చు. లడ్డూ ప్రసాదాలు తీసుకొన్నాక పక్కనే కృష్ణశిలతో నిర్మించిన శివాలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. యాదాద్రి చు ట్టూ గ్రీనరీ మానసిక ప్రశాంతతను పంచుతుంది.