హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత వక్ఫ్‌బోర్డు ట్రిబ్యునల్‌గా ఉన్న రెండ్ల తిరుపతిని రాష్ట్ర శాసనసభ కార్యదర్శిగా నియమించనున్నట్టు తెలిసింది. ఆయన నియామకానికి సంబంధించిన ఫైలును ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దకు పంపించారు. త్వరలోనే ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు వస్తాయని తెలుస్తున్నది. రెండ్ల తిరుపతి గతంలో లా సెక్రటరీగా, జిల్లా జడ్జిగా కూడా పనిచేశారు. 2023 నుంచి 2025 వరకు ప్రభుత్వ న్యాయ కార్యదర్శిగా ఆయన పనిచేశారు. ప్రస్తుత శాసనసభ కార్యదర్శి వేదాంతం నరసింహాచార్యులు 2017లో శాసనసభ కార్యదర్శిగా పదోన్నతి పొందారు.
ఆయన 2019లోనే పదవీ విరమణ చేసినప్పటికీ గత ఆరేండ్ల్లుగా ఆయన పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగిస్తూ వస్తున్నది. రెండ్ల తిరుపతిని శాసనసభ కార్యదర్శిగా నియమించాలని భావిస్తున్న ప్రభుత్వం నరసింహాచార్యులను శాసనమండలికి కార్యదర్శిగా నియమించనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం శాసనసభ ఆవరణలోనే పాత శాసనసభ భవన పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ పనులను ఒకట్రెండు నెలల్లోనే పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. వచ్చే శాసనసభ, శాసనసమండలి సమావేశాలను పక్కపక్కన ఉండే భవనాల్లోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇక పార్లమెంటులో ఉండే విధంగానే తెలంగాణ శాసనసభ సచివాలయాన్ని మార్చాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే శాసనమండలి, శాసనసభలకు వేర్వేరుగా కార్యదర్శులను నియమిస్తున్నట్టు తెలిసింది.