హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి సూచన మేరకు జూనియర్ డాక్టర్లకు ప్రతి నెల గ్రీన్ చానెల్ ద్వారా వేతనాలు చెల్లించడానికి సానుకూలంగా ఉన్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. సోమవారం తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీ-జూడా) ప్రతినిధులతో మంత్రి సమావేశమై పలు అంశాలమీద చర్చించారు.
ఉస్మానియా దవాఖాన నూతన భవన నిర్మాణానికి, ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆధునీకరణకు సానుకూలంగా ఉన్నట్టు మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని జూనియర్ డాక్టర్ల హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పనపై నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో టీ-జూడా అధ్యక్షుడు డాక్టర్ శ్రీహర్ష, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఇస్సాక్, ప్రతినిధులు డాక్టర్ మోరే వంశీకృష్ణ, డాక్టర్ దీపాంకర్, డాక్టర్ చంద్రికరెడ్డి తదితరులు పాల్గొన్నారు.