కాంగ్రెస్‌లో ఇలాంటివి సహజమే..!
మంత్రి కొండా సురేఖ వ్యవహారం టీ కప్పులో తుపాను లాంటిది. కొందరు ఏదో అయినట్టు చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివన్నీ సహజమే. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి.
-మీడియాతో మంత్రి పొంగులేటి
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులనే నిబంధనను ఎత్తివేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. గతంలో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు మంత్రిమండలి సూచనప్రాయంగా అంగీకరించింది. రాష్ట్రంలో జనాభా నియంత్రణ కట్టుదిట్టంగా అమలవుతున్న ప్రస్తుత తరుణంలో ఈ గరిష్ఠ నిబంధనను అమలుచేయాల్సిన అవసరంలేదనే అభిప్రాయాయానికి క్యాబినెట్ వచ్చింది. గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. వానకాలం సీజన్లో పండించిన ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలని, ధాన్యానికి మద్దతు ధరతోపాటు సన్నవడ్లకు ఇచ్చే రూ.500 బోనస్ రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. కొత్తగా హుజూర్నగర్, కొడంగల్, నిజామాబాద్‌లో అగ్రికల్చర్ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ‘ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల’ను నిర్వహించాలని నిర్ణయించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఏనూర్ మారెట్ యార్డ్‌కు పది ఎకరాలు, నల్సార్ లా వర్సిటీకి అదనంగా ఏడెకరాల భూమిని కేటాయించడానికి మంత్రిమండలి ఓకే చెప్పింది. నల్సార్ వర్సిటీలో అడ్మిషన్లలో స్థానిక సీట్ల కోటాను 25% నుంచి 50 శాతానికి పెంచాలని నిర్ణయించింది. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో హ్యామ్ మోడ్‌లో మొదటి దశలో 5,566 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట ఓఆర్ఆర్, ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫాం రోడ్ వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సంబంధించి రక్షణ శాఖ భూములను వినియోగించుకుంటున్నందున వారికి ప్రత్యామ్నాయంగా 435.08 ఎకరాల భూములను అప్పగిస్తూ క్యాబినెట్ తీర్మానించింది. కృష్ణా-వికారాబాద్ బ్రాడ్‌గేజ్ రైలు మార్గం నిర్మాణానికి 845 హైక్టార్ల భూసేకరణకు అయ్యే రూ.438 కోట్ల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు క్యాబినెట్ అంగీకరించింది. మన్ననూర్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం మొత్తం వ్యయంలో మూడోవంతు రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది.