హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి కారును పోలిన గుర్తులను తొలగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదినికి బీఆర్ఎస్ పార్టీ విజ్ఞ ప్తి చేసింది. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని కమిషనర్ కార్యాలయంలో మంగళవారం బీఆర్ఎస్ నేతలు బో యినపల్లి వినోద్‌కుమార్, సోమ భరత్‌కుమార్ తదితరులు కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. కారును పో లిన చపాతీ రోలర్, కెమెరా, ఓడ గుర్తులతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి జరిగిన నష్టాన్ని వారు వివరించారు. ఆయా గుర్తులు చూసేందుకు కారు గుర్తు మాదిరిగానే ఉన్నాయని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి రావాల్సిన ఓట్లు.. ఆయా గుర్తుల అభ్యర్థులకు పడ్డాయని తెలిపారు. వృద్ధులు, దృష్టిలోపం ఉన్నవారు ఓట్లు వేసేటప్పుడు గుర్తుల విషయంలో గందరగోళానికి గురవుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు తగ్గి నష్టం జరిగే అవకాశం ఉన్నందున చపాతీ రోలర్ (రొట్టెల పీట), కెమెరా, ఓడ గుర్తులను నిలిపివేసి ఏ పార్టీకి, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించవద్దని కోరారు. తమ విన్నపాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పినట్టు బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు.