కరీంనగర్, ఆగస్టు 14 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలాలపై కక్ష కొనసాగుతున్నది. ఇప్పటికే పలు పత్రికలు, చానళ్ల విలేకరులపై వేధింపులు నిత్య కృత్యం కాగా తాజాగా ఆ జిల్లా డీపీఆర్వో అధికారిక గ్రూపు నుంచి ఓ ప్రధాన పత్రిక స్టాఫర్ సహా మండలాల రిపోర్టర్ల నంబర్లను తొలగించడం కక్షసాధింపులకు పరాకాష్టగా చేరిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారిక కార్యక్రమాలు, అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు, ఇతర అంశాల వంటి వివరాలను ప్రతికలకు రోజూ తెలిపేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలోనూ జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో అధికారిక గ్రూపు ఉండే విషయం అందరికీ తెలిసిందే.
అందులో అన్ని ప్రధాన పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలతోపాటు అక్రిడేటెడ్ జర్నలిస్టులు ఉంటారు. ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాలు, అధికారుల సమీక్ష సమావేశాలు, ఇతర వివరాలను డీపీఆర్వో ఆ గ్రూపులో పోస్టు చేస్తారు. వాటిని జర్నలిస్టులు వారివారి పత్రికలకు పంపుతారు. కానీ, గురువారం మాత్రం ఉన్నట్టుండి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేసే ప్రధాన పత్రిక స్టాఫర్, టౌన్ రిపోర్టర్లతో పాటు 13 మండలాల రిపోర్టర్లు కలిపి మొత్తం దాదాపు 15 మంది పేర్లను డీపీఆర్వో గ్రూప్ నుంచి తొలగించారు. ఉదయం 11 గంటల సమయంలోనే ఇది జరిగింది. వారిని ఎం దుకు రిమూవ్ చేశారనే విషయంపై ఏ అధికారి కూడా స్పష్టత ఇవ్వలేదు.
ప్రకటన కూడా జారీచేయలేదు. దీనిపై డీపీఆర్వోను అడిగితే ఏమీ చెప్పకుండా దాటవేశారు. ఇలా ఒక్కసారిగా ఓ పత్రిక రిపోర్టర్లను మూకుమ్మడిగా అధికారిక గ్రూపు నుంచి తొలగించడం జర్నలిస్టు వర్గాల్లో కలకలం రేపింది. కారణాలు తెలుసుకొనేందుకు వారు ప్రయత్నించగా సంబంధిత అధికారులు ఫోన్ కూడా ఎత్తలేదని సమాచారం. ఈ విషయం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సమస్య పెద్దది కావడంతో పలువురు ప్రజాప్రతినిధులు సైతం ఈ చర్యను ఖండించారు. ఈ నేపథ్యంలో తిరిగి సాయంత్రం 7 గంటలకు తిరిగి ఆ రిపోర్టర్లను గ్రూపులో యాడ్ చేశారు. ఈ తొలగింపు ప్రక్రియను డీపీఆర్వో చేశారా? లేక ఆయనపై ఎవరైనా ఉన్నతాధికారుల ఒత్తిడి ఉన్నదా? అని చర్చ నడుస్తున్నది. దీని వెనుకాల కొందరు అధికారుల ప్రమేయం ఉండొచ్చన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.