అచ్చంపేట : శ్రీశైలం ఎడమగట్టు సొరంగం ( ఎస్ఎల్బీసీ టన్నెల్) లో సహాయక చర్యలు 51వ రోజుకు చేరుకున్నాయి. ప్రమాద స్థలం సమీపంలోని పెద్ద పెద్ద బండ రాళ్లను ఎస్కవేటర్ సహాయంతో విచ్చినం చేసి, లోకో ట్రైన్ ద్వారా బయటికి తరలిస్తున్నట్లు ఎస్ఎల్బీసీ ( SLBC.) టన్నెల్ ప్రత్యేకాధికారి శివశంకర్ లోతేటి ( Special Officer Shiva Shanker ) తెలిపారు.
ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామంలో గల ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్లెట్ 1 ఆఫీస్ వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా శివశంకర్ లోతేటి మాట్లాడుతూ సి, సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు చేపడుతున్న సహాయక చర్యలలో దినదినంగా పురోగతి సాధిస్తున్నట్లు వెల్లడించారు.
సహాయక చర్యల్లో భాగంగా కన్వేయర్ బెల్ట్ మరమ్మతులు, వెంటిలేషన్ ( Ventilations) పొడిగింపు, మట్టి తవ్వకాలు, టీబీఎం భాగాలను కత్తిరించే పనులు, స్టీలును బయటకు తరలించే పనులు, ఊట నీటిని బయటకు పంపింగ్ చేసే పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు.
ప్రమాద ప్రదేశానికి చేరుకునే మార్గాన్ని త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా, సహాయక చర్యల వేగం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. టన్నెల్ లోపల సహాయక చర్యలు అత్యంత సమగ్రంగా, ప్రణాళికాబద్ధంగా సాగుతున్నట్లు తెలిపారు. జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా కు చెందిన శాస్త్రవేత్తలు, నీటిపారుదల శాఖ నిపుణులు, టన్నెల్ నిర్మాణాల్లో అనుభవం కలిగిన ఇంజినీర్లు,ఇతర సంబంధిత శాఖల నిపుణుల సూచనలు, సలహాలను అనుసరిస్తున్నామన్నారు.
సమీక్ష సమావేశంలో సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎస్ డి ఆర్ఎఫ్ అధికారి గిరిధర్ రెడ్డి, జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజనీర్ సంజయ్ కుమార్ సింగ్,హైడ్రాధికారులు తదితరులు పాల్గొన్నారు.