హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ) : శస్తచ్రికిత్సల్లో ఎంత పురోగతి సాధించినప్పటికీ కొన్ని ప్రత్యేక కేసులు వైద్యులకు పెద్ద సవాళ్లను విసురుతుంటాయి. అలాంటి ఓ సవాలును ఏఐజీ హాస్పిటల్స్ వైద్యులు విజయవంతంగా అధిగమించారు. దీర్ఘకాలం నుంచి కాలేయ వ్యాధి (లివర్ సిర్రోసిస్)తో బాధపడుతున్న ఓ మహిళ (45) మూత్రపిండంలోని క్యాన్సర్ కణితిని అత్యాధునిక రోబోటిక్ సర్జరీ ద్వారా తొలగించి ఆమెకు పునర్జన్మ ప్రసాదించారు. ఆ రోగి కాలేయం దాదాపు 5 సెం.మీ. పరిమాణంలో విస్తరించి ఉండటంతో సంప్రదాయ ల్యాపరోస్కోపిక్ సర్జరీ కాకుండా రోబోటిక్ శస్త్రచికిత్స నిర్వహించారు.
తెలుగు రాష్ర్టాల్లో ఇలాంటి సర్జరీ నిర్వహించడం ఇదే తొలిసారని ఏఐజీ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ నాగేశ్వరరెడ్డి వెల్లడించారు. ఎంతో అరుదైన ఈ శస్ర్తచికిత్సలో రోబోటిక్ సర్జరీ నిపుణులతోపాటు కాలేయ, అనస్థీషియా వైద్యబృందం పాల్గొన్నట్టు తెలిపారు. సాధారణంగా ఇలాంటి శస్త్రచికిత్సర తర్వాత రోగులు కోలుకునేందుకు కొన్ని నెలలు పడుతుందని, కానీ ఈ కేసులో సర్జరీ తర్వాత కేవలం 48 గంటల్లోనే కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ఏఐజీ హెపటాలజీ డైరెక్టర్ డాక్టర్ మిథున్శర్మ వివరించారు.