హైదరాబాద్, మే 23, ( నమస్తే తెలంగాణ): ఆరోగ్య కార్యకర్తలకు జీతాలు చెల్లించాలని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును అమలు చేయని నిర్మల్ జిల్లా కలెక్టర్, నిర్మల్ మున్సిపల్ కమిషనర్లకు విధించిన జైలు శిక్ష అమలును దిసభ్య ధర్మాసనం నిలుపుదల చేసింది. తమ ఉత్తర్వులు 15 రోజుల్లో అమలు చేయని పక్షంలో నిర్మల్ కలెక్టర్‌కు నెల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా, మున్సిపల్ కమిషనర్‌కు 15 రోజుల జైలు, వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ గతంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు.
ఆరోగ్య కార్యకర్తలు 47 మందిని కలెక్టర్ ఆధ్వర్యంలో నియామకం జరిగింది. ఆరు నెలలైనా వివిధ కారణాలు చెబుతూ వేతనాలు చెల్లించకపోవడంతో సయ్యద్ షకీరు అహ్మద్ సహా 28 మంది హైకోర్టును ఆశ్రయించారు. 2022 సెప్టెంబరులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంతో సయ్యద్ షకీర్ అహ్మద్ మరో 27మంది విడివిడిగా రెండు కోర్టు ధికరణ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి, కలెక్టర్, మున్సిపల్ కమిషనరు 15రోజులు గడువు ఇస్తూ మే3న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు అమలు చేయని పక్షంలో వారివురికి జైలు శిక్ష, జరిమానా అమలు అవుతుందని చెప్పారు. సింగిల్ జడ్జి విధించిన శిక్షను సవాలు చేస్తూ నిర్మల్ కలెక్టర్ మహమ్మద్ ముషారఫ్ అలీ ఫరూఖీ అప్పీలు దాఖలు చేశారు. అప్పీలుపై గురువారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి విజయసాయిరెడ్డి, జస్టిస్ ఏ లక్ష్మీనారాయణతో కూడిన డివిజన్ బెంచి పైవిధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలిపివేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.