Uttam Kumar Reddy | మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎస్ఎల్బీసీ సొరంగంలో నీటి ప్రవాహంతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతున్నదని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఎస్ఎల్బీసీ చాలా క్లిష్టమైన సొరంగమని, 11 బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని చెప్పారు. మంగళవారం సొరంగం వద్ద సహాయ చర్యలను పరిశీలించిన తర్వాత ఆయన మాట్లాడుతూ టన్నెల్‌లోని సహజ రాతి నిర్మాణాలు సడలడంతో అకస్మాత్తుగా నీరు, మట్టి ప్రవహించాయని తెలిపారు. టన్నెల్లో 12-13 అడుగుల వరకు నీరు నిండిపోయిందని చెప్పారు. ఇది అత్యంత క్లిష్టమైన పరిస్థితి అని, సమస్యను పరిష్కరించేందుకు సాంకేతిక నిపుణులు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారని తెలిపారు. ఇంజినీరింగ్ అధికారులు, సహాయ బృందాలతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వెల్లడించారు. ఎస్ఎల్బీసీపై గత పాలకులు చేసిన నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ఆరోపించారు. ఏ టన్నెల్ నిర్మాణం జరిగినా లీకేజీలు సర్వసాధారణమని చెప్పారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొన్నారు.
ఉత్తమ్ కోసం భట్టి నిరీక్షణ
సొరంగం వద్ద సహాయ చర్యల పరిశీలన కోసం రోడ్డు మార్గాన వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఉదయం 9:30 గంటలకు దోమలపెంటకు చేరుకున్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా అక్కడికి వచ్చారు. వీరంతా సొరంగం దగ్గరకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ మంత్రి ఉత్తమ్రాకపోవడంతో ఎదురుచూడాల్సి వచ్చింది. హైదరాబాద్ నుంచి దోమలపెంటకు ఉత్తమ్ హెలికాప్టర్లో వచ్చారు. సమీక్ష సమావేశంలోనూ ఉత్తమ్‌కుమార్ అంతా తానే అన్నట్టుగా హడావుడి చేశారని విమర్శలు వినిపించాయి. మీడియాతో కూడా ఉత్తమ్ కుమార్‌రెడ్డే మాట్లాడారు. మళ్లీ లేటెస్ట్ అప్డేట్ సాయంత్రం తర్వాత బ్రీఫ్ చేస్తామంటూ అక్కడి నుంచి భోజనానికి వెళ్లిపోయారు. దీంతో సాయంత్రం మీడియా సమావేశానికి భట్టి, కోమటిరెడ్డి డుమ్మా కొట్టారు.
అంతా పాజిటివ్‌గా చూపించండి..
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన మీడియా సమావేశం తర్వాత మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓ మీడియా ప్రతినిధిని ఉద్దేశించి మాట్లాడుతూ ‘అంతా పాజిటివ్‌గా కవర్ చేయండి’ అంటూ కోరారు. ‘అక్కడ కూడా నెగటివ్ చూపించకండి. పాజిటివ్‌లోనే కవర్ చేయండి’ అంటూ వేడుకున్నారు. ఓ వైపు హడావుడి చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటూనే మళ్లీ ఇలా మాట్లాడడం ఏంటని మీడియా ప్రతినిధులు ముక్కున వేలేసుకున్నారు.
మా గోడు పట్టించుకోండి సారు !
తోటి కార్మికులు సొరంగంలో చిక్కుకుపోవంతో నాలుగు రోజులుగా టన్నెల్ సమీపంలోని షెడ్డుల్లో విషాదచాయలు అలముకున్నాయి. బాధితుల కుటుంబ సభ్యులు క్షణక్షణం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు అక్కడికి వచ్చిపోతున్న మంత్రుల హడావుడి, మీడియాతో ముచ్చటించడం, సర్వశక్తులూ ఒడ్డుతున్నామని ప్రకటనలు చేయడం పరిపాటిగా మారిపోయిందని మీడియా వర్గాల్లో చర్చ నడుస్తున్నది. తమ వారి ఆచూకీ లేక తీరని దుఃఖంలో ఉన్న తమను ఓదార్చేనాథులు కరువయ్యారని కార్మికులు, వారి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. కనీసం తినడానికి తిండి కూడా లేదని, కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తమ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని వాపోతున్నారు.