హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): సూక్ష్మ, చిన్న పరిశ్రమ (ఎంఎస్ఈ)లకు, వాటి ఉత్పత్తుల కొనుగోలుదారులకు మధ్య తలెత్తే వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ (ఎంఎస్ఈఎఫ్సీ)లు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. వీటి ద్వారా గత ఎనిమిదేండ్లలో 5 వేలకుపైగా కేసులు పరిష్కారమయ్యాయి. తద్వారా రూ.1,670 కోట్లకుపైగా బకాయిల చెల్లింపు పూర్తయింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు చాలా రాష్ర్టాలు ఎంఎస్ఈఎఫ్సీలను ఏర్పాటు చేశాయి. ఇందులో భాగంగా తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 7 ఎంఎస్ఈఎఫ్సీలను ఏర్పాటు చేసింది.
సూక్ష్మ, చిన్న పరిశ్రమల అభివృద్ధి చట్టం ప్రకారం ఎంఎస్ఈల నుంచి సరుకు కొనుగోలు చేసిన బయ్యర్లు 60 రోజుల్లోగా చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. లేకుంటే ఆ తర్వాత రోజు నుంచి బ్యాంకు వడ్డీ వర్తిస్తుంది. ఒకవేళ బయ్యర్ కొనుగోలు చేసిన సరుకు నాణ్యత లేదా మరేదైనా విషయంలో సమస్య తలెత్తితే 15 రోజుల్లోగా సంబంధిత ఎంఎస్ఈకి తెలియజేయాలి. బయ్యర్ ఎటువంటి ఫిర్యాదు చేయకుండా, తీసుకున్న సరుకుకు చెల్లింపులు చేయకుండా ఉంటే సంబంధిత ఎంఎస్ఈలు కౌన్సిల్ను ఆశ్రయించవచ్చు. అయితే, చట్ట ప్రకారం కౌన్సిల్ పాస్చేసిన అవార్డులో కనీసం 75% కోర్టులో డిపాజిట్ చేసిన తర్వాతే కేసు వేయాల్సి ఉంటుంది.
2,292.14 కోట్ల బకాయిలకు రాష్ట్రవ్యాప్తంగా 7,036 ఫిర్యాదులు అందాయి. వాటిలో 5,306 పరిష్కారమవడంతో రూ.1,672.3 కోట్లు వసూలయ్యాయని, మిగిలిన పరిష్కార దశలో ఉన్నట్టు అధికారులు తెలిపారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు మొండి బకాయిల కారణంగా ఎంఎస్ఈలు తరచూ మూతపడుతుండేవి. అవి రెండు-మూడేండ్లు నడవడమే కష్టంగా ఉండేది. తెలంగాణ ఏర్పాటు తర్వాత నాటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టితో ఎంఎస్ఈలు ఏర్పాటుచేసి వాటి చట్టబద్ధతకు చర్యలు తీసుకున్నారు.