హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): బీసీ, ఈబీసీ విద్యార్థులకు 2023-24 విద్యా సంవత్సరానికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ. 1,550.11 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బీసీ విద్యార్థుల పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్స్ కోసం రూ.450.39 కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ.8,8731.48 కోట్లు, ఈబీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం 212.40 కోట్లను విడుదల చేసింది. దీంతో 6.50 లక్షల మంది బీసీ విద్యార్థులు, దాదాపు 75వేల మందికిపైగా ఈబీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. మహాత్మా జ్యోతిబాఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి ప్రభుత్వం రూ. 70.80 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో చేపట్టిన మోడ్రన్ దోభీ ఘాట్ల నిర్మాణానికి రూ.1.50 కోట్లను విడుదల చేసింది. రజకుల కోసం తెలంగాణ సర్కారు బెంగళూరు తరహాలో అత్యాధునిక యంత్ర పరికరాలతో దోభీ ఘాట్లను నిర్మిస్తున్నది. ఇందుకోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ.3 కోట్లను ప్రతిపాదించగా, అందులో రూ.1.50 కోట్లను విడుదల చేసింది.