Group-1 Main | హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఒకే హాల్‌టికెట్‌తో అన్ని గ్రూప్-1 మెయిన్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. మొదటి పరీక్షకు ఏ హాల్‌టికెట్‌ను వినియోగించారో దాన్నే మొత్తం పరీక్షలకు వినియోగించాలి. ఎందుకంటే ప్రతిరోజు హాల్‌టికెట్‌పై అభ్యర్థి సంతకం తీసుకోవడంతోపాటు, ఇన్విజిలేటర్ సైతం సంతకం చేస్తారు. ఈ హాల్‌టికెట్‌ను జాగ్రత్తగా పరీక్షలు ముగిసే వరకు దాచుకోవాలి. అంతేకాదు.. ఇదే హాల్‌టికెట్‌ను నియామకాలు పూర్తయ్యే వరకు దాచిపెట్టుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. ఇక పరీక్షకు గంట ముందే పరీక్షకేంద్రాల గేట్లను మూసేస్తారు. అభ్యర్థులు అంతలోపే పరీక్షాకేంద్రాల్లోకి ప్రవేశించాలని కమిషన్ పేర్కొన్నది. అక్టోబర్ 21 నుంచి 27వరకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మూడు గంటలపాటు గ్రూప్-1 మెయిన్ పరీక్షలను నిర్వహించనున్నారు.
వారం పదిరోజుల్లో హాల్‌టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేయనుంది. అక్టోబర్ 21న జనరల్ ఇంగ్లిష్ పేపర్‌తో పరీక్షలు ప్రారంభంకానున్నాయి. అయితే జనరల్ ఇంగ్లిష్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. ఈ మార్కులను మెయిన్ స్కోర్ కోసం పరిగణనలోకి తీసుకోరు. కానీ అభ్యర్థులు ఈ పరీక్షలో క్వాలిఫై కావడం తప్పనిసరి. అక్టోబర్ 22న జనరల్ ఎస్సే(పేపర్ -1), 23న హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ(పేపర్-2), 24న ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్(పేపర్-3), 25న ఎకానమీ అండ్ డెవలప్మెంట్(పేపర్-4), 26న సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్(పేపర్-5), 27న తెలంగాణ ఉద్యమం, రాష్ర్టావతరణ (పేపర్-7) పేపర్లకు పరీక్షలను నిర్వహిస్తారు.
పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులకు అవగాహన కల్పిచేందుకు పేపర్లవారీగా శాంపిల్ ఆన్సర్ బుక్‌లెట్స్‌ను టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచింది. అయితే ఈ ఆన్సర్ బుక్లెట్స్ అన్ని ఒకే విధంగా లేవు. ఒక్కో పేపర్‌ను బట్టి ఒక్కో విధంగా ఉంటాయి. కాగా అభ్యర్థులు చెప్పులు ధరించి మాత్రమే పరీక్షకు హాజరుకావాలి. షూస్‌తో అస్సలు రావొద్దు. పరీక్షాకేంద్రాల్లో వస్తువులు భద్రపరిచే ఏర్పాట్లేవి ఉండవు. కావున విలువైన వస్తువులు వెంట తెచ్చుకోవద్దు.