హైదరాబాద్, నవంబర్ 7(నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ ఎడమ కాలువ 3వ జోన్‌కు సాగునీటిని విడుదల చేయాలని ఏపీ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎర్రమంజిల్‌లోని జలసౌధలో కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్‌ను గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణారావు మాట్లాడుతూ ప్రస్తుతం నాగార్జున సాగర్‌లో 301 టీఎంసీల పూర్తి సామర్థ్యంతో లక్షా 59వేల క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేసే స్థితిలో ఉన్నదని తెలిపారు.
ఎడమ కాలువ 2, 3 జోన్లకు సంబంధించి 3.62 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 132 టీఎంసీల కేటాయింపు ఉన్నదని, అందులో ఏపీకి 32.25 టీఎంసీల వాటా ఉన్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం 3వ జోన్‌లోని 2.11లక్షల ఆయకట్టు రైతులు ఆరుతడి పంటలు సాగుచేశారని, దానికి ఈ నెల 15 నుంచి సాగునీటిని విడుదల చేయాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు. అదేవిధంగా కేఆర్ఎంబీ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలని కోరారు. ఆయా అంశాలపై కేఆర్ఎంబీ సానుకూలంగా స్పందించినట్టు గోపాలకృష్ణారావు తెలిపారు. ఆయన వెంట యనమద్ది పుల్లయ్య చౌదరి తదితరులు ఉన్నారు.