హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : టెట్ ఫలితాలు విడుదలైనందున 10వేల టీచర్ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర బీఎడ్, డీఎడ్ అభ్యర్థుల సంఘం కోరింది. శుక్రవారం సంఘం ప్రతినిధులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి, హరీశ్, వీరబాబు, సాయి, కవిత, కిరణ్మయి తదితరులు వినతిపత్రం సమర్పించిన వారిలో ఉన్నారు.
రెండో శనివారం స్కూళ్లకు సెలవు ఇవ్వాలి ; ఇవ్వని బడులపై చర్యలు తీసుకోండి: విద్యార్థి సంఘాలు
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. నిబంధనలు పాటించడంలేదు. రెండో శనివారం బడులకు సెలవు ఇవ్వడంలేదు. దీంతో టీచర్లు, విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి ఉంటున్నది. ఇదే విషయంపై టీపీటీఎల్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నేతలు ఇటీవల పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌ను కలిసి రెండో శనివారం సెలవు ఇవ్వకుండా, క్లాసులు నిర్వహిస్తున్న బడులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు.