హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 2021 బ్యాచ్‌కు చెందిన మరో 434 మంది నర్సుల సర్వీస్ క్రమబద్ధీకరణ ప్రక్రియను వైద్యారోగ్య శాఖ ప్రారంభించింది. 2,418 మంది నర్సుల్లో కేవలం 27 మందికి చెందిన సర్వీస్‌ను క్రమబద్ధీకరించి, మిగతావారిని నిర్లక్ష్యం చేయడంపై ఈ నెల 27న ‘నమస్తే తెలంగాణ’లో ‘డీపీహెచ్‌లో జిల్లాకో న్యాయం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై వైద్యారోగ్య శాఖ తక్షణం స్పందించింది. మరో 434 మంది నర్సుల సర్వీస్‌ను క్రమబద్ధీకరించే ప్రక్రియను అదేరోజు ప్రారంభించింది. పోలీస్ వెరిఫికేషన్ పూర్తయ్యి నివేదికలు అందినవారి వివరాలతో జాబితాను విడుదల చేసింది. ఆయా అభ్యర్థుల సర్వీస్ వివరాలను అందజేయాలని అన్ని మెడికల్ కాలేజీల సూపరింటెండెంట్లు, దవాఖానల డైరెక్టర్లకు లేఖలు రాసింది. ఈ మేరకు డీపీహెచ్ కార్యాలయంలోని నర్సింగ్ విభాగం హెడ్ శ్వేత మొంగా ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ వెరిఫికేషన్ పూర్తయ్యి, నివేదికలు అందిన తర్వాత మిగతా అభ్యర్థుల ఉద్యోగాలను కూడా క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు సంబురాలు చేసుకొంటున్నారు. ‘నమస్తే తెలంగాణ’కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
ఏం జరిగిందంటే..
2021 జూలైలో ప్రభుత్వం 2,418 మంది స్టాఫ్ నర్సులను నియమించింది. సుమారు 800 మంది డీఎంఈ పరిధిలో, మిగతావారు డీపీహెచ్ పరిధిలో పనిచేస్తున్నారు. వీరు రెండేండ్లపాటు ప్రొబేషనరీ కాలంలోనే పనిచేయాలనే నిబంధన ఉన్నది. ఆ తర్వాత వారి సర్వీస్‌ను క్రమబద్ధీకరించాల్సి ఉంటుంది. ఈ బాధ్యత డీపీహెచ్ కార్యాలయానిది. నిరుడు ఆగస్టు నాటికే వారి రెండేండ్ల ప్రొబెషనరీ కాలం ముగిసింది. ఆ తర్వాత వారి సర్వీస్ క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు పోలీస్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. డీపీహెచ్ కార్యాలయంలోని నర్సింగ్ సెక్షన్ సిబ్బంది వాటిని పరిశీలించి వారి సర్వీస్‌ను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. అయితే, మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో పనిచేస్తున్న 27 మంది స్టాఫ్ నర్సులను మాత్రమే రెగ్యులరైజ్ చేసి మిగతా వారిని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురించగా, ప్రభుత్వం స్పందించింది.