హైదరాబాద్, మార్చి 24(నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల వెబ్సైట్ మొరాయించింది. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచింది. సోమవారం ఉదయం నుంచే ఈ పరిస్థితి నెలకొన్నది. ప్రధాన సర్వర్లోనే సాంకేతిక సమస్య తలెత్తడంతో వెబ్సైట్ పూర్తిగా డౌన్ అయినట్టు అధికారులు తెలిపారు. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాలకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది.
సర్వర్ వస్తది.. కాసేపు ఆగండి.. అంటూ సాయంత్రం వరకు అధికారులు సాగదీస్తూ వచ్చారు. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ఆస్తులు కొనుగోలుదారులు అప్పటికే విక్రయదారులకు డబ్బు, రిజిస్ట్రేషన్ల కోసం చలానాలు చెల్లించడంతో ఆందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు సాయంత్రం సమస్య కొలిక్కి రావడంతో వేచి ఉన్నవారి రిజిస్ట్రేషన్లు పూర్తిచేశారు. వెబ్సైట్లో తరచూ సాంకేతిక సమస్యలొస్తున్నా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, తద్వారా క్షేత్రస్థాయిలో తాము ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని ప్రజలు వాపోతున్నారు.