వరంగల్, జనవరి 29 : ఇటీవల హైదరాబాద్‌లో టీహబ్‌లోకి రిజిస్ట్రేషన్ కార్యాలయాలను తరలించాలని చూసిన రేవంత్ సర్కార్.. వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శల రావడంతో వెనక్కితగ్గింది.. తాజాగా వరంగల్‌లో కేసీఆర్ మార్క్ అద్భుత కట్టడం కాళోజీ క్షేత్రంలోకి కుడా(కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ) కార్యాలయాన్ని తరలించాలని నిర్ణయించడంపై స ర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కళలు, కళాకారులకు వేదికగా ఉండేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం ప్రతిష్ఠ ను.. కాంగ్రెస్ సర్కార్ మసకబారేలా చేస్తున్నది.
హైదరాబాద్‌లోని రవీంద్రభారతికి దీటుగా గత ప్రభుత్వం రూ.100 కోట్లతో వరంగల్‌లో కా ళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించింది. కళా ప్రదర్శనల కు వేదికగా మాత్రమే ఉపయోగించుకోవాల్సిన ఈ భవనంలోకి కుడా(కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ) కార్యాలయాన్ని తరలిస్తున్నది. ప్రస్తుత కుడా ఆఫీస్‌ను ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తున్నది. నెల రోజుల క్రితమే కుడా కార్యాలయంలో ఉన్న ఇతర శాఖలకు ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వగా, మరో 15 రోజుల్లో కుడా కార్యాలయ భవనం లీజ్ నోటిఫికేషన్ విడుదలకు సమాయత్తమవుతున్నారు.
కాళోజీ కళాక్షేత్రం నిర్వహణ భారంగా మారుతున్ననదని కుడా అధికారులు చెబుతున్నారు. ఓరుగల్లు నగరానికి ‘ ఐకాన్’ కట్టడంగా ఉన్న కళాక్షేత్రం నిర్వహణ సర్కార్‌కు భారమవుతుందన్న మాటలు విడ్డూరంగా వినిపిస్తున్నాయి. కళాక్షేత్రంలో కళల ప్రదర్శనలకు రుసుము తీసుకొని అద్దెకు ఇస్తున్నారు. కళాకారులకు, కళాసంస్థలకు అందుబాటులో లేని ధరలు నిర్ణయించి కళాకారుల నుంచి ముక్కుపిండి రుసుము వసూలు చేస్తున్నారు. అ యి నా, కళాక్షేత్రం నిర్వహణ భారమవుతున్నదని సర్కార్ భావించడం విమర్శలకు తావిస్తున్నది.