Namaste Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : తాము ఎలాంటి ఒత్తిళ్లకు లొంగలేదని, తహసీల్దార్, గుర్రంగూడ రైతులు ఇచ్చిన రెండు వేర్వేరు ఫిర్యాదుల మేరకు అటు ప్రవీణ్‌రెడ్డిపై, ఇటు ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ‘పోలీసులా, కీలుబొమ్మలా?’ అంటూ ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనంపై రాచకొండ పోలీసులు స్పందించారు. సర్వే నంబర్ 92లోని అసైన్డ్ భూమిని డెవలప్మెంట్ కోసం రైతుల నుంచి ప్రవీణ్‌రెడ్డి అగ్రిమెంట్ చేసుకుంటున్నారని, రెవెన్యూ డిపార్ట్మెంట్ పేరును కూడా దుర్వినియోగం చేస్తున్నాడని బాలాపూర్ తహసీల్దార్ ఇందిరాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రవీణ్‌రెడ్డిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. నిందితుల కాలంలో ప్రవీణ్‌రెడ్డి పేరు చేర్చలేదంటూ పత్రిక కథనంలో పేర్కొన్నారని, ఇది వాస్తవం కాదని, ప్రవీణ్‌రెడ్డి పేరును నిందితుల కాలంలో చేర్చామని తెలిపారు.
ప్రవీణ్‌రెడ్డిని స్టేషన్‌కు పిలిపించి విచారించి, తగిన పత్రాలు సమర్పించాలని సూచించడంతో పాటు బాలాపూర్ మండల అధికారులను ఆ భూమికి సంబంధించిన రికార్డులు ఇవ్వాలని లేఖ ద్వారా కోరినట్టు వివరించారు. కథనంలో తమపై చేసిన ఆరోపణలు సత్యదూరంగా ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. ‘సర్వే నంబర్ 92లో దళితులు, బలహీన వర్గాలకు చెందిన సుమారు 200 మందికి ప్రభుత్వం అసైన్ట్ భూమి కేటాయించింది.. తరతరాలుగా ఆ పొలాలను సాగుచేసుకుంటున్నం.. హైదరాబాద్ సిటీ విస్తరణలో భాగంగా గత ప్రభుత్వంలో హెచ్ఎండీఏ అధికారులు మా వద్దకు వచ్చి ఆ భూమిని తీసుకొని అభివృద్ధి చేసి ఇస్తామని చెప్పారు.. ఎకరానికి 700 గజాల స్థలం కావాలని కోరినం.. అనివార్య కారణాలతో ఆ ప్రతిపాదనలు ముందుకు వెళ్లలేదు. ల్యాండ్ పూలింగ్ చేస్తూ కొంత భూమిని మాకు కేటాయించాలని అధికారులను కలిసినం.
ఈ క్రమంలో మేము భూములను అమ్ముకుంటున్నట్టు అసత్య కథనాలు ప్రచురించి మాకు నష్టం కలిగించారు’ అని గుర్రం గూడ రైతులు ‘నమస్తే తెలగాణ’పై ఫిర్యాదు చేసినట్టు పోలీసులు వివరించారు. ఈ మేరకు దినపత్రికపై కేసు నమోదుచేశామని వెల్లడిచారు. మీర్పేట్ పోలీసులు ఈ రెండు కేసులను విచారిస్తున్నారని తెలిపారు. ఈ రెండు కేసుల విషయంలో పోలీసులు చట్టపరంగా వ్యవహారిస్తున్నారని, ఎలాంటి ఒత్తిళ్లకు తొలగ్గలేదని పేర్కొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ను లక్ష్యంగా చేసుకొని అసత్య, ప్రేరేపిత, పక్షపాత కథనాలు ప్రచురించిన పత్రికపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉహాజనిత సమాచారం ఆధారంగా పత్రికలో కథనాలు ప్రచురించవద్దని, ప్రజలు, రైతులను భయాందోళనలకు గురిచేయవద్దని కోరారు.
నవంబర్ 1న కొందరు రైతులు చేసిన ఫిర్యాదు మేరకు ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికపై మీర్పేట్ పోలీస్‌స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని 319(2), 338, 340(2), 353 (2), 61 (2) (ఏ), ఆర్/డబ్ల్యూ 3 (5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వీటిలో మూడు 338, 319(2), 353 (2) సెక్షన్లు నాన్ బెయిలబుల్. 338 సెక్షన్ ఆధారంగా జీవిత ఖైదు లేదా పదేండ్ల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంటుంది. 319(2) సెక్షన్లో ఐదేండ్ల జైలు శిక్ష లేదా జరిమానా ఒక్కోసారి రెండూ విధించే అవకాశం ఉన్నది. 353 (2) సెక్షన్లో మూడేండ్ల శిక్ష, జరిమానా, లేదా రెండూ విధించే అవకాశం ఉన్నది. అయితే, పత్రికలో వచ్చిన కథనాలకు, పెట్టిన నాన్ బెయిలబుల్ సెక్షన్లకు ఎలాంటి సంబంధం ఉన్నదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉద్యమకాలం నుంచి ఎన్నో కేసుల్లో కొట్లాడిన ‘నమస్తే తెలంగాణ’కు ఈ కేసులు కొత్తేం కాదని, చివరికి న్యాయం గెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.