హైదరాబాద్, మార్చి 24(నమస్తే తెలంగాణ): హైడ్రాతో పాటు అస్తవ్యవస్థ విధానాలతో రాష్ట్ర రియల్ రంగాన్ని దెబ్బతీసిన సర్కారు ఇప్పుడు మరో పిడుగు వేసింది. త్వరలోనే రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేందుకు సిద్ధమవుతున్నది. ఇందుకు సంబంధించి భూభారతి అమల్లోకి తెచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం మీడియాతో చిట్‌చాట్ చేశారు.
నాకు అనిరుధ్‌రెడ్డికి ఏ సమస్య లేదు
సొంత పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తొలిసారి స్పందించారు. తనకు అనిరుధ్‌రెడ్డికి మధ్య ఏ సమస్య లేదని స్పష్టంచేశారు. అసలు అనిరుధ్‌రెడ్డి చెప్పే అభిమన్యురెడ్డి ఎవరో కూడా తనకు తెలియదని పేర్కొన్నారు.
జీపీ సిబ్బందికి జీతాలేవి?అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని
హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : గ్రామపంచాయతీ సిబ్బందికి ఐదు నెలలుగా జీతాలివ్వడం లేదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బడ్జెట్ పద్దులపై చర్చలో ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ సిబ్బందికి వెంటనే జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘బీఆర్ఎస్ హయాంలో పలు గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించారు. మిగతా గ్రామాల్లోనూ వాటిని నిర్మించాలి. ఎస్సీ సబ్‌ప్లాన్‌ను పకడ్బందీగా అమలుచేయాలి. గిరిజనుల్లోనూ ఏ,బీ,సీ,డీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు.
30 ఏండ్లలో ఇంతటి నీటిఎద్దడి చూడలే: శంకర్
హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కరువుఛాయలు తీవ్రంగా అలుముకున్నాయని, ప్రజలు తాగు, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గత 30 ఏండ్లలో ఇంతటి నీటిఎద్దడి చూడలేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీలో ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామాలు, మున్సిపాలీటీల్లో ప్రజలకు నీటిని అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో మహిళా సంక్షేమం పెరగాలంటే.. ఎక్సైజ్ ఆదాయం తగ్గాలని పేర్కొన్నారు.
పంచాయతీరాజ్ (సవరణ)బిల్లు-2025కి ఆమోదం
హైదరాబాద్, మార్చి 24 (నమస్తేతెలంగాణ): తెలంగాణ పంచాయతీరాజ్(సవరణ) బిల్లు-2025కి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని 79 గ్రామపంచాయతీలను షెడ్యూల్ 8 తొలగించి పురపాలికలలో విలీనం చేయాలనే ప్రతిపాదన బిల్లును పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క అసెంబ్లీలో సోమవారం ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై జరిగిన చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతాలక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, కోవ లక్ష్మి, కాంగ్రెస్ సభ్యులు భూపతిరెడ్డి, సంజీవ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీల చట్టం సవరణ బిల్లుకు ఆమోదం
హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : మున్సిపాలిటీల చట్టం సవరణ బిల్లుకు సోమవారం రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా కొన్ని గ్రామాలను మున్సిపాలిటీల్లో చేర్చడం, మరికొన్నింటిని తొలగించడం వంటి పలు సవరణలు ఉన్నాయి. ముఖ్యంగా మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ల ఎన్నికలో రాజ్యసభ సభ్యులకు ఓటుహక్కు కల్పించారు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతోపాటు సమీపంలోని పలు గ్రామాలను విలీనం చేయడంతో కొత్తగా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైంది.
అవయవాల మార్పిడి చట్టం అమలుకు తీర్మానం
హైదరాబాద్, మార్చి 24(నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ మానవ అవయవాలు, కణజాలాల మార్పిడి చట్టం-1994ను తెలంగాణలో అనుసరించేందుకు ఉద్దేశించిన తీర్మానాన్ని శాసనసభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. చికిత్స ప్రయోజనాలు, మానవ అవయవాల తొలగింపు, నిల్వ, మార్పిడిని నియంత్రించి మానవ అవయవాలతో వాణిజ్య లావాదేవీలను నిరోధించడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.