హైదరాబాద్, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ): రిజిస్ట్రేషన్ చార్జీల బాదుడు కు రంగం సిద్ధమవుతున్నది. భూముల మార్కెట్ విలువను భారీగా పెంచి, త ద్వారా రిజిస్ట్రేషన్ ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. భూముల మార్కెట్ విలువ పెం పుదల విషయంలో ఇప్పటికే ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకొన్నది. త్వరలో జరుగబోయే క్యాబినెట్ భేటీలో భూముల విలువ పెంపుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని సమాచారం. జూన్ నుంచి కొత్త ధరలను అమల్లోకి తీసుకొచ్చేందుకు సర్కార్ చర్యలు తీసుకొంటున్నదని తెలిసింది.
భూముల విలువ పెంపునకు సంబంధించి ఆదాయ మార్గాల అన్వేషణకు ప్రభుత్వం నియమించిన రెవెన్యూ జనరేషన్ అండ్ రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల సమావేశమైన సబ్ కమిటీ భూముల విలువను పెంచేందుకు మార్గం సుగుమం చేసింది. వాస్తవానికి, భూముల విలువతోపాటు రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల క్రితమే భావించింది. ఇందుకు సంబంధించి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఒక నివేదికను కూడా రూపొందించింది. ఎక్కడెక్కడ ఎంతెంత పెంచాలో నివేదికలో పొందుపరిచింది. అయితే, అప్పటికే రియల్ఎస్టేట్ రంగం మందగమనంలో ఉం డటం, క్రయవిక్రయాలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది.
ఈ పరిస్థితుల్లో ధరలు పెంచితే మరింత నష్టం జరుగుతుందని, ప్రజల నుంచి సైతం వ్యతిరేకత వస్తుందనే ఆందోళన ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమైంది. దీంతో ఆ నిర్ణయాన్ని, నివేదికను తాత్కాలికంగా పక్కనపెట్టారు. ఇప్పుడు మళ్లీ ఆ నివేదికను బయటికి తీస్తున్నారు. ఈ మేరకు క్యాబినెట్ సబ్ కమిటీ రిజిస్ట్రేషన్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నాటి నివేదికలను ముందుగా సబ్‌కమిటీకి సమర్పించాలని, ఆ తర్వాత క్యాబినెట్‌కు నివేదించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఆదేశాలను గమనిస్తే భూముల విలువ పెంపు తథ్యమని స్పస్టమవుతున్నది.
ప్రజల మీద భారీగా భారంమోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖ భూముల విలువను ప్రాంతాలను బట్టి 10% నుంచి 30% పెంపును ప్రతిపాదించింది. ప్రభుత్వం మాత్రం గరిష్ఠ పెంపు ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకొనే అవకాశం ఉన్నదని తెలిసింది. అంటే, భూముల విలువ ప్రస్తుతమున్న ధరలపై 30% వరకు పెరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో భారీగా పెంచేందుకు సిద్ధమవుతున్నదని తెలిసింది. భూముల ధరను పెంచితే, అనివార్యంగా రిజిస్ట్రేషన్ చా ర్జీలు సైతం అదే స్థాయిలో పెరుగుతాయి. ఉదాహరణకు ప్రస్తుతం ఒక ప్రాంతంలో గజం భూమి విలువ రూ.7,500 ఉన్నదనుకుంటే 30 % పెంపుదలతో ఈ ధర రూ.9,750కి చేరుతుంది.
ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి 100గజాల ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేస్తే ప్రస్తుత విలువ ప్రకారం రిజిస్ట్రేషన్ చార్జీలు 7.5% కింద రూ.56,250 చెల్లించాలి. కానీ, ఇప్పుడు ధరల పెంపుతో అదే భూమికి రూ. 73,125 చెల్లించాల్సి ఉంటుంది. అంటే గతంతో పోల్చితే భూమి కొనుగోలుదారులు రూ.16,875 అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఓపెన్ ప్లాట్లు, భూములు కొనుగోలు చేసే వారిపై భారీగా ఆర్థికభారం పడనున్నది.
ఈ విధంగా భూముల ధరలను పెంచడం ద్వారా రాష్ట్ర ఖజానాను పెంచుకునే ఆలోచన చేస్తుండటం గమనార్హం. అయితే భూముల ధరల పెంపు ప్రతిపాదనలపై రియల్ఎస్టేట్ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. సర్కార్ ఆలోచనపై వారు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే రెండున్నరేండ్లుగా రాష్ట్రవ్యాప్తంగా రియల్ఎస్టేట్ వ్యా పారం పడకేసిందని, ఇప్పుడు భూముల విలువ పెంపుతో మరింత నష్టం జరిగే ప్రమాదం ఉన్నదని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.