హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ ఆధారంగా రిజిస్ట్రేషన్లు 10 నెలల్లోనే రెట్టింపయ్యాయి. పోర్టల్‌ను గతేడాది అక్టోబర్ 29న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించగా.. నవంబర్ 2వ తేదీ నుంచి కార్యకలాపాలు మొదలయ్యాయి. పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు, వెంటనే మ్యుటేషన్లు జరుగడం, అరగంటలోపే పట్టా చేతికి వస్తుండటంతో క్రమంగా ధరణిలో లావాదేవీల సంఖ్య పెరిగింది. రిజిస్ట్రేషన్లు (సేల్, గిఫ్ట్, సక్సెషన్, పార్టిషన్), నాలా కలిపి నవంబర్‌లో జరిగిన లావాదేవీలతో పోల్చితే ఆగస్టులో రెట్టింపు నమోదయ్యాయి. స్లాట్బుకింగ్స్లోనూ ఇదే ఒరవడి కనిపించింది. నవంబర్‌తో పోల్చితే ఆగస్టులో ఏకంగా 120 శా తం అధికంగా స్లాట్లు బుక్ అయ్యాయి.
వరుసగా రెండో నెల
రెండు నెలలుగా ధరణిలో స్లాట్ బుకింగ్స్‌లో దూకుడు కనిపిస్తున్నది. పెండింగ్ మ్యు టేషన్లను మినహాయిస్తే వరుసగా లక్షకు పైగా స్లాట్ బుకింగ్స్ (రిజిస్ట్రేషన్లు, నాలా కలిపి) న మోదవుతున్నాయి. జూన్‌లో 92,238 స్లా ట్లు బుక్ కాగా, జూలైలో ఏకంగా 1,21,785 స్లా ట్లు నమోదై రికార్డు సృష్టించాయి. ధరణి ప్రా రంభించినప్పటి నుంచి ఇదే అత్యధికం. జూలై లో భూముల విలువను ప్రభుత్వం సవరిస్తుందన్న అంచనాలతో ఆగస్టులో 88,497 స్లాట్లు బుక్కయ్యాయి. పెండింగ్ మ్యుటేషన్లను కలిపితే 1,00,617 నమోదయ్యాయి. వరుసగా రెండోనెల లక్ష మార్క్‌ను దాటింది.